ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే వేధిస్తారా? : లోకేశ్

ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే వేధిస్తారా? అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. విశాఖ పర్యటనలో లోకేశ్.. గుండెపోటుతో చనిపోయిన డాక్టర్ సుధాకర్ కుటుంబసభ్యులను పరామర్శించారు. సుధాకర్ ఇంటికి వెళ్లి వైద్యుడి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ వైద్యులకు సరైన మాస్కులు, పీపీఈ కిట్లు ఇవ్వలేదని నిరసన తెలిపినందుకు సుధాకర్‍పై కేసులు పెట్టి మానసిక క్షోభకు గురి చేశారన్నారు. నిరంతరం ప్రజలకు సేవ చేసిన వ్యక్తి సుధాకర్ అని కొనియాడారు. ఇది మూమ్మాటికి ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు. సుధాకర్ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వ వేధింపుల వల్లే వైద్యుడు మృతి చెందారన్నారు. బడుగులను వేధించడం ఇక్కడితో ఆపకపోతే అధికార వైకాపా తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.