మంగళగిరిలో ఈసారి భారీ మెజారిటీతో గెలుస్తా : లోకేశ్
వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచే తాను పోటీ చేయనున్నట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. వైసీపీ నేతలపై వేసిన పరువు నష్టం కేసులో తన వాంగ్మూలం ఇచ్చేందుకు గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టుకు వచ్చారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళితో పాటు సింగలూరు శాంతిప్రసాద్పై లోకేశ్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. తాడికొండ మండలం కంతేరులో 14 ఎకరాల పొలాన్ని లోకేశ్ కొనుగోలు చేశారని పోసాని కృష్ణమురళి ఆరోపించారు. ఓ ఛానెల్ నిర్వహించిన చర్చలో సింగలూరు ప్రసాద్ కూడా ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ ఈ కేసుల్లో వీరిద్దరికీ న్యాయస్థానం ద్వారా నోటీసులు పంపినా స్పందించలేదని తెలిపారు. ఈసారి మంగళగిరిలో భారీ మెజారిటీతో గెలిచేది తానేనని తెలిపారు. వైసీపీ పాలనలో పరిశ్రమలేవి రాష్ట్రానికి రావట్లేదు. ఉన్నవి కూడా తరలిపోతున్నాయని విమర్శించారు.













