Mega DSC: నిరుద్యోగులకు శుభవార్త.. మెగా డీఎస్సీ పై స్పష్టత ఇచ్చిన లోకేష్..
మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తాజాగా నిరుద్యోగ ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ (MLC election code) ముగిసిన వెంటనే ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ప్రారంభం అవుతుందని వెల్లడించారు. ఇప్పటికే 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సంతకం చేసిన ఈ ఫైల్ ఎప్పుడు అమలు అవుతుందా అని ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు మంత్రి లోకేశ్ ఈ ప్రకటనతో మంచి ఊరట ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీ (TDP) కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి లోకేశ్ డీఎస్పీ(DSC ) ప్రకటనపై స్పష్టత ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 80% టీచర్ పోస్టులను టీడీపీ ప్రభుత్వమే భర్తీ చేసిందని గుర్తుచేశారు. ఉపాధ్యాయ బదిలీల విషయంలో పారదర్శక విధానం పాటించేలా ‘బదిలీ చట్టం’ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. విద్యా వ్యవస్థలో ఎటువంటి అనాలోచిత విధానాలకు తావు లేకుండా సరైన నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇక ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ప్రతి శుక్రవారం విద్యాశాఖ కమిషనర్ అందుబాటులో ఉంటారని, ఉపాధ్యాయ సంఘాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్ధుల విద్యా భవిష్యత్తు కోసం టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. గత ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడిన లోకేశ్, జగన్ హయాంలో రూ.3,000 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు మిగిలిపోయాయని గుర్తు చేశారు. అయితే, టీడీపీ ప్రభుత్వం ఏడాదికొద్దీ వేచి చూడకుండా ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లోనే రూ.800 కోట్ల బకాయిలను చెల్లించిందని తెలిపారు. జగన్ ప్రభుత్వం పెట్టిన అన్ని బకాయిలను పూర్తిగా చెల్లించే బాధ్యత తమదని వెల్లడించారు. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు బకాయిలను పెంచి, ఇప్పుడు వైసీపీ ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.
అదనంగా, ప్రభుత్వ బడుల్లో డ్రాపౌట్ రేటు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతను పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని తెలియజేస్తూ, విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు.













