చంద్రబాబు వ్యాక్సిన్లు పంచితే… మీరెందుకు

చంద్రబాబు నాయుడు వ్యాక్సిన్లు పంచితే, మీరెందుకు అధికారంలో ఉండటమని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు తమ వైఫల్యాలు మర్చిపోతారన్న దుర్భుద్ధితోనే ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుపై కేసులు పెట్టడం ప్రతివాడికి ఒక ప్యాషన్ అయిపోయిందని మండిపడ్డారు. కరోనా యాక్టివ్ కేసుల జాబితాలో రాష్ట్రం ఆరవ స్థానంలో, రోజువారీ కేసుల పెరుగుదలలో 4వ స్థానంలో ఉందని తెలిపారు. వ్యాక్సినేషన్ పంపిణీలో 28వ స్థానంలో ఉందని అన్నారు. ప్రజలు ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నవారు వారికి అండగా ఉండాలని తెలిపారు. సమస్యల తీవ్రతను పక్కదారి పట్టించడానికి పాలకులు కుయుక్తులు పన్నుతున్నారని అన్నారు.
రాష్ట్రంలో రోజూ సంభవించే మరణాలను ప్రభుత్వం తక్కువ చేసి చూపుతోందని ఆరోపించారు. ప్రజలంతా అమ్మఒడి వద్దు ఆక్సిజన్ కావాలంటున్నారని అన్నారు. సున్నావడ్డీ వద్దు సున్నా మరణాలు ఉండేలా చేయమంటున్నారని చెప్పారు. ఇప్పుడు ఆక్సిజన్ నిల్వల కోసం గ్లోబల్ టెండర్లు పిలవడమేంటని ప్రశ్నించారు. అక్రమ కేసులు పెట్టడంలో కాకుండా, ప్రజలను కాపాడటంలో పోటీ పడాలని అన్నారు.