Nagababu: కూటమిలో చిచ్చు రేపిన నాగబాబు కామెంట్స్..!?
జనసేన (Janasena) 12వ ఆవిర్భావ వేడుకలు పిఠాపురంలో (Pithapuram) ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జయకేతనం పేరుతో భారీ బహిరంగసభను ఏర్పాటు చేసింది ఆ పార్టీ. రాష్ట్రంతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్నాటక తదితర ప్రాంతాల నుంచి కూడా జనసేన అభిమానులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పలువురు నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జనసేన ఎదిగిన క్రమాన్ని వివరించారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భవిష్యత్ దిశానిర్దేశం చేశారు. ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు (Nagababu) కూడా ప్రసంగించారు. చివర్లో ఆయన చేసిన ఓ కామెంట్ ఇప్పుడు టీడీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తోంది.
‘పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపుకు నేనే కారణమని ఎవరైనా అనుకుంటే అది వారి..ఖర్మ’ అని వ్యాఖ్యానించారు నాగబాబు. ఎన్నికలకు ముందే పవన్ కల్యాణ్ గెలుపు ఖాయమైందన్నారు. ఇది కచ్చితంగా పిఠాపురం వర్మను ఉద్దేశించే పరోక్షంగా ఇలా మాట్లాడారని టీడీపీ శ్రేణులు (TDP Cadre) భగ్గుమంటున్నాయి. నాగబాబుకు ఇలా సెటైర్లు వేయడం అలవాటే. ఆయన పరోక్షంగా ఇలా ప్రాసలతో మాట్లాడుతుంటారు. ఇప్పుడు వర్మను ఉద్దేశించి ఖర్మ అని సంబోధించారని.. టీడీపీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. నాగబాబు కామెంట్స్ పై సోషల్ మీడియాలో ఆధారాలతో సహా విరుచుకు పడుతున్నారు.
పిఠాపురంలో పవన్ కల్యాణ్ కోసం సీటు త్యాగం చేశారు ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ్. (SVSN Varma)! పవన్ కల్యాణ్ పోటీ చేయకపోతే కచ్చితంగా ఈ సీటు వర్మదే. అయితే పవన్ కల్యాణ్ పోటీ చేయాలనుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) చెప్పగానే అంగీకరించారు. అంతేకాక పవన్ కల్యాణ్ కూడా తన గెలుపును వర్మ భుజాలపై పెడుతున్నానని స్వయంగా చెప్పారు. పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నా వర్మ మాత్రం ఆయన గెలుపుకోసం తీవ్రంగా కృషి చేశారు. వర్మ సపోర్ట్ లేకుండా పవన్ కల్యాణ్ కు అంత మెజారిటీ వచ్చేది కాదనేది విశ్లేషకుల అంచనా. అవసరంకోసం వర్మను వాడుకుని ఇప్పుడు ఆయన్ను విమర్శించడం సరికాదంటున్నారు.
నాగబాబుకు ఎమ్మెల్సీ సీటు రావడానికి కారణం కూడా వర్మే అని చెప్పొచ్చు. ఎందుకంటే నాగబాబు బరిలో లేకుంటే కచ్చితంగా వర్మకు ఎమ్మెల్సీ సీటు లభించేది. ఇప్పుడు కూడా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన తప్పుకున్నారు. ఇంత చేసినా ఇప్పుడు వర్మను టార్గెట్ చేయడం నాగబాబు అవకాశవాదానికి నిదర్శమని టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. తాము లేకుండా పోటీ చేస్తే 2019లో ఏం జరిగిందో తెలుసుకదా అని గుర్తు చేస్తున్నాయి. నాగబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని టీడీపీ నేతలు సూచిస్తున్నారు.













