Nagababu: నాగబాబుకు మంత్రి పదవి లేనట్టేనా…?
ఆంధ్రప్రదేశ్ లో జనసేన (Janasena) నేత నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో కూటమి వెనక్కి తగ్గిందా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది. మంత్రి పదవులు తక్కువగా ఉన్నా పవన్ కళ్యాణ్ మాత్రం క్యాబినెట్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, తీసుకుంటున్న నిర్ణయాలు అన్నీ కూడా సంచలనం అవుతున్నాయి. ఎప్పుడు ఏదో ఒక పర్యటనతో ఆయన వార్తల్లోనే ఉంటున్నారు.
పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటుగా వైసీపీ నుంచి వచ్చే నేతలను తమ పార్టీలోకి తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వైసీపీలో ఇమడలేని నేతలకు ఇప్పటికే జనసేన పార్టీ స్వాగతం పలికింది. ఇక ఇదే టైంలో క్యాబినెట్ లో మరో జనసేన మంత్రిని కూడా చేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రయత్నాలు చేయగా దానికి తెలుగుదేశం పార్టీ బిజెపి కూడా అంగీకారం తెలిపారు. ఖాళీగా ఉన్న ఒక మంత్రి పదవి విషయంలో జనసేన నేత నాగబాబును తీసుకునేందుకు చంద్రబాబు కూడా అంగీకారం తెలిపారు.
ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా చేసింది. అయితే తెలుగుదేశం పార్టీ క్యాడర్లో దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో కూటమి ఈ విషయంలో వెనక్కి తగ్గినట్లు సమాచారం. కేవలం నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి మాత్రమే ఇచ్చేసి సరిపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఇదే విషయంపై నాగబాబు తో చర్చించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీ వ్యవహారాలను చూస్తున్నారు. అయితే ఆయన ఎక్కువగా కష్టపడ్డారని… అందుకే ఆయనకు మంత్రి పదవి ఇస్తున్నామని ఆయన స్థానంలో ఎవరున్నా సరే మంత్రి పదవి ఇస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
కానీ ఇది కూటమిలో వ్యతిరేకత కారణమయ్యే అవకాశం ఉండటంతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తో చర్చించినట్లు సమాచారం. అటు సీనియర్ నేతలు అభిప్రాయం కూడా తీసుకున్న చంద్రబాబు ఈ విషయంలో వెనక్కి తగ్గాలని.. ఎమ్మెల్సీ పదవి విషయంలో తమకు ఎటువంటి ఇబ్బంది లేదని… కానీ మంత్రి పదవి ఇచ్చే విషయంలో మాత్రం ఆలోచించాలని పవన్ ను చంద్రబాబు కోరగా అందుకు పవన్ కళ్యాణ్ అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తోంది.













