వైసీపీ వైఖరిని తప్పుబట్టిన నాదెండ్ల మనోహర్
బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ రాత్రికి రాత్రి హడావుడిగా వైసీపీ తీసుకున్న నిర్ణయాన్ని జనసేన పార్టీ రాష్ట్ర కన్వీనర్ నాదెండ్ల మనోహర్ తప్పుబట్టారు. రాజకీయ పార్టీలను నియంత్రించేందుకు ప్రభుత్వం తన నిరంకుశ ధోరణితో ఈ ఉత్తర్వులు ఇచ్చిందంటూ ఆరోపించారు. జనవాణి, కైలు రైతు భరోసా ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘‘విశాఖలో పవన్‌కు జరిగిన అవమానాన్ని అందరూ చూశారు. వపన్‌ను కలిసేందుకు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో ప్రజలు తరలి రావడం, పవన్‌ను పోలీసులు నిర్బంధించడం అంతా అందరికీ తెలుసు. తాజాగా బహిరంగ సభలు, ర్యాలీలపై హోంశాఖ ఇచ్చిన చీకటి ఉత్తర్వులు నిరంకుశత్వానికి పొడిగింపే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ద్వారా ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛలో రాజకీయ పార్టీలు కార్యక్రమాలు కూడా ఉంటాయి. మరి ఈ ఆర్టికల్ రాష్ట్రంలో నిషేధించాలని వైసీపీ యత్నిస్తుందా?’’ అని నాదెండ్ల విమర్శించారు. అంతేకాకుండా విజయవాడలో సీఎం జగన్ అన్ని వాహనాలను నిలిపివేసి రేషన్ వాహనాలను, చెత్త వాహనాలను ప్రారంభించినప్పుడు ప్రజలు పడిన ఇబ్బందులు ఆయనకు కనిపించలేదా అని విమర్శించారు.













