కడప ఉక్కు ఫ్యాక్టరీపై ఉన్న శ్రద్ధ.. విశాఖ ఉక్కుపై లేదు
కడప ఉక్కు ఫ్యాక్టరీపై ఉన్న శ్రద్ధ విశాఖ ఉక్కుపై ఎందుకు లేదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్‌తో రైతులు తలపెట్టిన మహా పాదయాత్ర విజయవంతం కావాలని అన్నారు. పాదయాత్రలో రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. పాదయాత్రకు ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. విశాఖ ఉక్కు రక్షణ బాధ్యత నూటికి నూరుశాతం వైకాపాదేనని అన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం సీఎం జగన్ ఒక్కసారైనా నిరసన తెలిపారా? అని ప్రశ్నించారు. రుణ ఒప్పందాల్లో గవర్నర్ పేరు రాయడం దుర్మార్గమన్నారు. శాసనమండలిని రద్దు చేయాలని శాసనసభలో తీర్మానం చేశారనీ, కానీ ఇపుడేమో మండలిలో ఖాళీలు భర్తీ చేయాలంటూ ఢల్లీిలో బతిమిలాడుతున్నారని ఆక్షేపించారు. విశాఖ ఉక్కుపై తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో ప్లకార్డులు చూపించాలని డిమాండ్ చేశారు.













