వైసీపీకి ఎంపీల షాక్… ఫ్యాన్ కు భారీ కుదుపు…
వైసీపీకి భారీ షాక్. పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన ఇద్దరు కీలక నేతలు.. ఫ్యాన్ పార్టీకి గుడ్ బె చెప్పారు. ఇద్దరు వైసీపీ ఎంపీలు పార్టీకి, పదవికి సైతం రాజీనామాలు చేశారు. పార్లమెంట్ లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ కు వైసీపీ ఎంపీలు ఇరువురు రాజీనామా పత్రాలను అందజేశారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రాలను అందజేశారు. అనంతరం వైసీపీ పార్టీకి సైతం మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావులు రాజీనామా చేశారు. వారు.. వైఎస్జగన్మోహన్ రెడ్డికి కుడి భుజంలా వ్యవహరించిన మోపిదేవి వెంకట రమణ,పార్టీలో కీలక వ్యవహరించిన బీద మస్తాన్ రావు. ఏపీ సీఎం చంద్రబాబు .. రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని.. అందుకే ఆపార్టీలో చేరుతున్నట్లు మోపిదేవి స్పష్టం చేశారు.
వైసీపీ పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. జగన్కు నమ్మిన బంట్లుగా ఉన్నరాజ్యసభ సభ్యులు ఆ పార్టీని వీడటం పెద్ద దెబ్బగా అభివర్ణిస్తున్నారు.ఎంపీల రాజీనామాల పర్వం వీరిద్దరితో ఆగేలా కనిపించడం లేదు. నలుగురు ఎంపీలు మినహా మిగిలిన వారంతా వైసీపీని వీడనున్నట్టు టాక్ నడుస్తోంది. పార్టీని వీడనున్నారంటూ ప్రచారం జరుగుతున్న ఏడుగురిలో మోపిదేవి, బీద మస్తాన్ రావు.. రాజీనామా చేశారు. రాజీనామా చేయనున్నారంటూ ప్రచారం జరుగుతున్నమిగిలిన ఐదుగురిలో.. అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, గొల్లబాబూరావు, మేడా రఘునాథరెడ్డి, ఆర్.కృష్ణయ్య ఉన్నారు. వీరంతా వైసీపీని వీడి టీడీపీ, బీజేపీ, జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని టాక్ నడుస్తోంది.
ఇటీవలే వక్ఫ్ బోర్డ్ సహా కీలక బిల్లుల సందర్భంగా తమకు రాజ్యసభలో బలముందని.. తమ అవసరం బీజేపీకి తప్పక ఉంటుందన్నారు వైసీపీ నేతలు. అయితే.. బీజేపీ అది పట్టించుకోలేదు. దీంతో వైసీపీ అధినేత .. జగన్ అనివార్యమైన పరిస్థితుల్లో ఇండియా కూటమి వైపు పయనిస్తున్నట్లు సంకేతాలిచ్చారు. ఈ సందర్భంలో మళ్లీ వక్ఫ్ బోర్డు సహా కీలకబిల్లులు సభలో చర్చకు వచ్చే సమయంలో .. తగిన బలముండాలని కూటమి ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది.
దీంతో ఈసారి రాజ్యసభ ఎంపీలపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించింది. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు పార్టీ నుంచి ఔట్ అయ్యారు.మిగిలిన వారు సైతం అదే దారిలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. వెళ్లే వారు వెళ్లనీ ప్రజలు మనవైపు ఉన్నారు మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు తప్పకుండా మనమే గెలుస్తామని జగన్ ఉన్నట్లు సమాచారం. అయితే కీలకనేతలు వెళ్లిపోతుండడంతో క్యాడర్ మాత్రం ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది.













