Naga Babu: ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి ..నాగబాబుకు మంత్రి పదవి దక్కతుందా..
ఏపీ(AP), తెలంగాణ (Telengana) రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ (MLA quota MLC) ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కొన్ని జిల్లాల్లో జరగనున్న నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ విడుదల కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. మార్చి 3వ తేదీన అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుండగా, మార్చి 10 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. 11న నామినేషన్ల పరిశీలన జరిపి, ఉపసంహరణకు మార్చి 13 వరకు గడువు ఇస్తారు. మార్చి 20న ఎన్నికలు నిర్వహించి అదే రోజు కౌంటింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
ఈనెల 29తో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలువురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండటంతో కొత్త సభ్యుల ఎంపికకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో జంగా కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు (Yanamala Rama Krishnudu) , పరుచూరి అశోక్ బాబు, తిరుమల నాయుడు, రామారావులు, తెలంగాణలో మహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్, సుభాష్ రెడ్డి, మల్లేశం, మీర్జా రియాజుల్ హసన్ ల పదవీకాలం ఈనెల 29తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్తగా అవకాశం పొందే వారెవరు అనే అంశంపై ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే ఏపీలో మంత్రి వర్గ విస్తరణపై చర్చలు జరుగుతుండగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సోదరుడు నాగబాబును (Nagababu) ఎమ్మెల్సీగా చేసేందుకు కూటమి వ్యూహం రచిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారని, అందుకు ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అవకాశం అందివచ్చినట్లు సమాచారం. టీడీపీకి రెండు, జనసేనకు రెండు, బీజేపీకి ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కూడా ఆశావాహులు తమ స్థానం కోసం కృషి చేస్తున్నారు.
ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు నామినేషన్ పదవుల భర్తీకి సిద్ధమవుతున్నట్లు ప్రకటించడంతో కూటమి పార్టీల నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజకీయ పార్టీలకు కీలకంగా మారిన ఈ ఎన్నికల్లో తమకు అవకాశం దక్కుతుందని చాలా మంది భావిస్తున్నారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగానే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల కావడం మరోసారి రాజకీయ ఉత్సాహాన్ని పెంచింది.
జనసేనలో కీలక నేతగా కొనసాగుతున్న నాగబాబు ఇప్పుడు కీలక హోదా దిశగా అడుగులు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తర్వాత పార్టీకి రెండో ముఖ్యమైన వ్యక్తిగా ఉన్న నాదెండ్ల మనోహర్ ఇప్పటికే మంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు నాగబాబును కూడా మంత్రివర్గంలోకి తీసుకురావాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు కూడా ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ పదవి ద్వారా నాగబాబును మంత్రిగా నియమించేందుకు కూటమి వ్యూహ రచిస్తోంది. మార్చి నెలలో ఏపీ, తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఏటువంటి కొత్త మార్పులు వస్తాయో వేచి చూడాలి .













