దీనిపై పోరాటం ఆపేది లేదు : బాలకృష్ణ
అసెంబ్లీలో తెలుగు సినిమా కళాకారులను వైసీపీ ఎమ్మెల్యేలు ఘోరంగా అవమానించారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ధ్వజమెత్తారు. శాసనసభలో సస్పెండ్ అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ సినీ రంగం నుంచే ఎన్టీఆర్ అసెంబ్లీకి వెళ్లి ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారని అన్నారు. సభలో తనకు మాత్రమే అవమానం జరగలేదని, మొత్తం తెలుగు సినీ పరిశ్రమ అధికార పార్టీ నేతలు కించపరిచారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై పెట్టిన కేసు అక్రమమని, దీనిపై పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీలో మీసం మెలేసి, తొడ కొట్టిందీ వైసీపీ ఎమ్మెల్యేలేనన్న ఆయన, తాను చేయని పనిని చేసినట్లు అసత్యాలు సృష్టించారన్నారు. స్పీకర్ చేత అబద్ధాలు చెప్పించారని దుయ్యబట్టారు. మంద బలంతో విర్రవీగుతున్న వైసీపీ ఎమ్మెల్యేలకు తగిన మూల్యం తప్పదన్నారు. ప్రజలే వారికి త్వరలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.













