అన్ని జిల్లాల్లో పాస్‌పోర్టు కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు మేలైన సేవలందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖమంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నెల్లూరులో పాస్‌పోర్టు కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కస్తూర్భా కళా క్షేత్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ నెల్లూరులో ఏర్పాటుచేసిన పాస్‌పోర్టు కేంద్రం దేశంలో 51వ దన్నారు. ఈ కేంద్రం ద్వారా రోజుకు 150 పాస్‌పోర్టులు మంజూరు చేయాలన్నది లక్ష్యంకాగా ప్రస్తుతానికి రోజుకు 50 పాస్‌పోర్టులు ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలలోనూ పాస్‌పోర్టు కేంద్రాలు ఏర్పాటుచేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. త్వరలోనే అనంతపురం, శ్రీకాకుళం, రాజమండ్రిలలోనూ పాస్‌పోర్టు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. పారదర్శకంగా, తక్కువ డాక్యుమెంట్లతో తక్కువ సమయంలో పాస్‌పోర్టులు మంజూరు చేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. విదేశీవ్వవహారాలు, పోస్టలశాఖలు సంయుక్తంగా పాస్‌పోర్టు కేంద్రాలను నిర్వహిస్తాయన్నారు. దేశంలో ఏటా 10 శాతం మేర పాస్‌పోర్టుల వినియోగం పెరుగుతోందన్నారు. ప్రతి రాష్ట్ర రాజధానిలో విదేశీభవనం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు.













