Nagababu: నాగబాబుకు పదవి లేనట్టేనా..?
జనసేన కీలక నేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సోదరుడు కొణిదెల నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారా..? ఇవ్వరా..? అనే దానిపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీకి ప్రస్తుతం ఇబ్బందులు ఉన్నాయి. అటు తెలుగుదేశం పార్టీ నుంచి పూర్తిస్థాయిలో సహకారం ఉంది. దీనితో కచ్చితంగా నాగబాబు క్యాబినెట్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని ప్రచారం ఊపందుకుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను నేపథ్యంలో ఆయన క్యాబినెట్ లోకి వెళ్లడం కష్టమే అనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి.
నాగబాబుని క్యాబినెట్ లోకి తీసుకుంటారనే అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి టీడీపీ(TDP) సోషల్ మీడియా ఒకరకంగా యుద్ధమే చేస్తుంది. దీనిపై ఇప్పటి సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో వెనక్కి తగ్గే అవకాశం లేదని.. నాగబాబు స్థానంలో ఎవరున్నా సరే మంత్రి పదవి ఇస్తామని ప్రకటించారు. అయితే నాగబాబు గతంలో టిడిపి నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఎక్కడో చోట కనబడుతూనే ఉంటాయి.
అలాగే అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)పై కూడా నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం కరెక్ట్ కాదని టిడిపి సోషల్ మీడియా కోరుతూనే ఉంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పై కూడా టిడిపి కార్యకర్తలు సున్నితంగా విమర్శలు చేస్తున్నారు. దయచేసి తమ మనోభావాలు అర్థం చేసుకోవాలని.. నాగబాబును క్యాబినెట్లోకి తీసుకోవద్దని కోరుతున్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై టిడిపి సోషల్ మీడియా ప్రభావం గట్టిగానే పడుతుంది.
గత ఐదేళ్లలో రెచ్చిపోయిన వాళ్ల విషయంలో టిడిపి సోషల్ మీడియా సీరియస్ గా ఉంది. దీనితో కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏకంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీల విషయంలో కూడా టిడిపి సోషల్ మీడియా ప్రభావం కనబడుతోంది. ఇక కొంతమంది అధికారులకు పోస్టింగ్ ఇవ్వాలన్నా సరే ప్రభుత్వ పెద్దలు ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చారు సోషల్ మీడియాలో కార్యకర్తలు. దీంతో కాస్త నాగబాబు విషయంలో వెనకడుగు వేసినట్టుగానే వాతావరణం కనబడుతోంది.













