పోలవరం ప్రాజెక్ట్‌పై ఇంజనీర్లకే స్పష్టత లేదు.. హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీలోని పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి హరీష్ రావు స్పందించారు. కాళేశ్వరం కన్నా ముందే ప్రారంభమైన పోలవరం మరో ఐదేళ్లు గడిచినా పూర్తికాదని హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు గురించి అక్కడి ఇంజనీర్లతో సమీక్షించానని, వారికి కూడా ప్రాజెక్ట్ ఇప్పుడప్పుడే పూర్తవుతుందన్న నమ్మకం లేదని తెలిపారు. ఇంజనీర్లు సైతం పోలవరం మరో ఐదేళ్లలో పూర్తయితే గొప్పే అంటున్నారని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో అక్కడ ఎవ్వరికీ స్పష్టత లేదని, సరైన సమయం చెప్పడం కాదు కదా ఉరామరిగా కూడా పోలవరం పూర్తయ్యే సమయాన్ని ఇంజనీర్లు కూడా చెప్పలేని పరిస్థితి అని హరీష్ రావు వెల్లడించారు. కానీ ఇక్కడ మాత్రం కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ప్రారంభించి ముగించినా.. దానిపై విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని, ప్రభుత్వం విమర్శలు చేస్తూ అనవసరపు రగడ సృష్టిస్తున్నాయని తెలంగాణ ప్రతిపక్షాలపై మండిపడ్డారు.













