ఎంపీ పురందేశ్వరి కుమారుడు రూ.కోటి విరాళం
కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బాపట్ల జిల్లా కారంచేడులో రూ.75 లక్షలతో నిర్మించిన శుద్ధు జలకేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మాజీ మంత్రి డి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. కారంచేడులోని జయప్రకాష్ నారాయణ చెరువు వద్ద రూ.కోటి నిధులతో నిర్మించనున్న మరో ఆర్వో ప్లాంట్‌కు కూడా శంకుస్థాపన చేశారు. శుద్ధ జల కేంద్రం నిర్మాణానికి దగ్గుబాటి పురందేశ్వరి కుమారుడు హితేష్ చెంచురామ్ రూ.కోటి చెక్కును మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా గొట్టిపాటి మాట్లాడుతూ కారంచేడు గ్రామస్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు నిధులు సమకూర్చడం, మరో ఆర్వో ప్లాంటు నిర్మాణానికి దగ్గుబాటి కుటుంబం ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం పురందేశ్వరి మాట్లాడుతూ కారంచేడులో గ్రామస్థుల సమస్యల పరిష్కారానికి దగ్గుబాటి కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని, ఈ శుద్ధ జలకేంద్రాన్ని గ్రామస్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.













