విశాఖలో పెట్టుబడిదారుల సదస్సు : మంత్రి అమర్నాథ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడిదారులను ఆకర్షించేలా శాఖల వారీగా ఉన్న అవకాశాలను గుర్తించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ అధికారులను ఆదేవించారు. ప్రధానంగా ఐటీ, విద్య, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, విద్యుత్, పర్యాటక, చేనేత వస్త్ర పరిశ్రమ, సముద్రయానం వంటి రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వచ్చే ఏడాది విశాఖపట్నటంలో నిర్వహించే పెట్టుబడిదారుల సదస్సు`2023లో ఆయా రంగాలకు చెందిన పెట్టుబడులను ఆకర్షించడంలో సంబంధిత శాఖల అధికారులు కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు.
ఈ సదస్సు నిర్వహణపై సచివాలయంలో సీఐఐ ప్రతినిధులతో పాటు ముఖ్య శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపాయి, కియా, హీరో, బ్రాండిక్స్ వంటి జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులనే పరిశ్రమల ప్రమోటర్లుగా వినియోగించుకోవాలి. వారి అభిప్రాయాలతో వాయిస్ రికార్డు, వీడియోలను రూపొందించి విస్తృత ప్రచారం కల్పించాలి. పెట్టుబడుల సదస్సు లక్ష్యాలు, ప్రయోజనాలు ప్రతిబింబించేలా లోగో, థీమ్ రూపొందించాలి అని పేర్కొన్నారు. సీఐఐ ప్రతినిధి నీజర్ జూమ్ ద్వారా సదస్సు లక్ష్యాలను వివరించారు.













