Medical Colleges: ముదురుతున్న మెడికల్ కాలేజీల వివాదం..!!

ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల (Medical Colleges) అభివృద్ధి విషయంలో అధికార టీడీపీ (TDP), విపక్ష వైసీపీ (YCP) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణంలో నిర్లక్ష్యం జరిగిందని, అందుకే పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) మోడల్‌తో వాటిని అభివృద్ధి చేస్తున్నామని టీడీపీ చెప్తోంది. వైసీపీ మాత్రం తమ పాలనలో 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభించామని, వాటిని పూర్తి చేయకుండా టీడీపీ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోందని ఆరోపిస్తోంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో రెండు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో ప్రచార యుద్ధం కొనసాగుతోంది.
2019-2024 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి అప్పటి జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటికోసం రూ. 8,480 కోట్లు కేటాయించగా, రూ.1,451 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ కాలేజీలు పూర్తయితే 2,550 అదనపు ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చేవి. ప్రారంభించిన వాటిలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీలు 2023-24 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యాయి, 750 సీట్లతో విద్యార్థులను చేర్చుకున్నాయి.
జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలనే ఉద్దేశంతో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ స్థాపించామని, వైద్య విద్యను అందుబాటులోకి తీసుకొచ్చామని వైసీపీ చెప్తోంది. ఆరోగ్యశ్రీ వంటి పథకాల ద్వారా ఉచిత వైద్య సేవలను ప్రజలకు అందించామంటోంది. చంద్రబాబు పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా స్థాపించలేదని, 1923 నుంచి 2019 వరకు కేవలం 11 ప్రభుత్వ కాలేజీలు మాత్రమే రాష్ట్రంలో ఉన్నాయని జగన్ విమర్శించారు.
అయితే వైసీపీ ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిందని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ఆరోపించారు. 17 కాలేజీల కోసం కేటాయించిన రూ. 8,480 కోట్లలో కేవలం 16% మాత్రమే ఖర్చు చేశారని, మిగిలిన నిధులను సక్రమంగా వినియోగించలేదని విమర్శించారు. పాడేరు, మదనపల్లె, ఆదోని, మార్కాపురం, పులివెందుల, పిడుగురాళ్లలోని కాలేజీలు 2024-25 విద్యా సంవత్సరంలో ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, సరైన మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది లేకపోవడంతో నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) నుంచి అనుమతి పొందలేకపోయాయని ప్రభుత్వం చెబుతోంది.
కేంద్రం నుంచి వచ్చిన రూ. 198 కోట్ల నిధులను వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని, కొన్ని కాలేజీల్లో తాత్కాలిక షెడ్లలో తరగతులు నిర్వహిస్తున్నారని సత్య కుమార్ ఆరోపించారు. అందుకే 10 కాలేజీలను పీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నరసిపట్నం, బాపట్ల, పార్వతీపురంలలో పీపీపీ మోడల్ లో పూర్తవుతాయన్నారు. 2027-28 విద్యా సంవత్సరంలో వీటిలో ప్రవేశాలు ప్రారంభమవుతాయని చెప్పారు.
పీపీపీ మోడల్ అంటే ప్రైవేటీకరణే అంటోంది వైసీపీ. ఇలా చేయడం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తుందని ఆరోపిస్తున్నారు. రూ. 8,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కేవలం రూ. 5వేలకే సంవత్సరానికి ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వడం ద్వారా ప్రజల ఆస్తులను దోచుకుంటున్నారని ఆరోపించారు. కమీషన్ల కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసింది అంటూ సోషల్ మీడియాలో వైసీపీ విమర్శిస్తోంది.
సోషల్ మీడియాలో ఈ విషయంపై రెండు పార్టీల మధ్య తీవ్రమైన ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. వైసీపీ ప్రచారాన్ని టీడీపీ ఫేక్ ప్రచారంగా కొట్టిపారేస్తోంది. వైసీపీ హయాంలో నిర్మాణం పూర్తి కాని కాలేజీలను తాము సమర్థవంతంగా పూర్తి చేస్తామని చెబుతోంది.