పోటీ నుంచి తప్పుకున్న మహాసేన రాజేష్..! అసలేం జరిగింది.?
మహాసేన రాజేశ్.. పేరు తెలుగువారికి సుపరిచితం. సోషల్ మీడియా వేదికపై పలు అంశాలపై ఆయన వీడియోలు చేస్తుంటారు. ఆయన వీడియోలు చాలా పాపులర్. ఎంతో మంది అభిమానులున్నారు. కొంతకాలం కిందటి వరకూ వైసీపీలో ఉన్న మహాసేన రాజేశ్.. ఇటీవలే టీడీపీలో చేరారు. తాజాగా ఆయనకు పి.గన్నవరం టికెట్ కేటాయించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే ఆయనపై సోషల్ మీడియాలో కొంతమంది విమర్శలు చేస్తుండడంతో తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు మహాసేన రాజేశ్.
డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం అసెంబ్లీ నుంచి టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థిగా సరిపెళ్ల రాజేశ్ కుమార్ అలియాస్ మహాసేన రాజేశ్ కు టికెట్ లభించింది. మహాసేన రాజేశ్ కు టికెట్ ఇవ్వడాన్ని చాలా మంది స్వాగతించారు. రెండ్రోజుల కిందటే ఆయన ప్రచారం ప్రారంభించారు. అయితే అనూహ్యంగా ఆయనపై సోషల్ మీడియాలో విమర్శల దాడి మొదలైంది. గతంలో తాను చేసిన వీడియోల నుంచి కొన్నింటిని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. గతంలో అగ్రవర్ణం అమ్మాయిలను ఎవరైనా పెళ్లి చేసుకుని ఇబ్బంది పడుతుంటే లక్ష ఖర్చు చేసైనా కాపాడుకుంటా అని గతంలో రాజేశ్ చెప్పారు. అయితే దాన్ని హిందువుల అమ్మాయిలను లేపుకురండి అని మహాసేన రాజేశ్ అన్నట్టు ట్రోల్ చేస్తున్నారు.
మరికొంతమంది మహాసేన రాజేశ్ కు ఇచ్చిన టికెట్ వాపస్ తీసుకోవాలని టీడీపీ – జనసేనకు సూచించారు. కొన్ని హిందూ సంఘాలు రాజేశ్ కు టికెట్ కంటిన్యూ చేస్తే ఉద్యమిస్తామన్నాయి. మరోవైపు నియోజకవర్గంలో కూడా మహాసేన రాజేశ్ కు పరిస్థితులు అనుకూలించడం లేదు. కొంతమంది నేతలు మహాసేన రాజేశ్ కు సహకరించడం లేదు. దీంతో మహాసేన రాజేశ్ బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఒక వెనుకబడిన వ్యక్తికి, ఒక సామాన్యుడికి టికెట్ దక్కితే వ్యవస్థ అంతా ఒక్కటైపోతుందా.. అని ఆవేదన వ్యక్తం చేశారు. తన వల్ల పార్టీకి చెడ్డపేరు రాకూడదనే ఉద్దేశంతోనే తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.
అయితే మహాసేన రాజేశ్ ను కావాలనే కొంతమంది టార్గెట్ చేసినట్లు అనుమానిస్తున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె ఢిల్లీలో ప్రెస్ మీట్ లో మహాసేన రాజేశ్ పేరు ప్రస్తావించారు. మహాసేన రాజేశ్ కూడా తనకు మద్దతిచ్చారన్నారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రోల్స్ విపరీతంగా మొదలయ్యాయి. సాక్షిలో కూడా మహాసేన రాజేశ్ పేరు బ్యానర్ అయింది. అయితే వైసీపీలో ఉన్నప్పుడే మహాసేన రాజేశ్ హిందూ అమ్మాయిలపై కామెంట్ చేశారు. అప్పుడు నోరు మెదపని ఈ సంఘాలు ఇప్పుడు దానిపై రచ్చ రచ్చ చేస్తున్నాయి. అప్పుడెందుకు నేరు తెరవలేదని టీడీపీ, జనసేన నేతలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. మహాసేన రాజేశ్ కు టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని వైసీపీ కేడరే ఇలా అసత్య ప్రచారాలు చేస్తోందని మండి పడుతున్నారు.













