వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. ఈ మేరకు స్వీకర్ కార్యాలయం ఒక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ పదవులకు ఏప్రిల్ 6న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత ఐదుగురు ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిథున్ రెడ్డి, అవినాశ్ రెడ్డి తమ రాజీనామా లేఖలతో నేరుగా స్పీకర్ కార్యాలయానికి వెళ్లి సుమిత్రా మహాజన్‌కు సమర్పించారు. అయితే, వాటిపై పునరాలోచించుకోవాలని ఆమె సూచించినప్పటికీ తమ నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని వారు సృష్టం చేశారు. దీంతో మరోసారి ఈ నెల తొలి వారంలో వారితో సమావేశమై రాజీనామా అంశంపై చర్చించగా ఎవనక్కి తగ్గేది లేదని ఎంపీలు అన్నారు. ధ్రువీకరణ పత్రాలిమ్మని స్పీకర్ కోరగా, ఎంపీలు వాటిని సమర్పించారు. ఆ తర్వాత 10 రోజుల పాటు మూడు దేశాల పర్యటనకు వెళ్లి ఈ నెల 19న భారత్‌కు చేరుకున్న స్పీకర్ సుమిత్రా మహాజన్, వైసీపీ ఎంపీల రాజీనామా అంశంపై అధికారులతో సంప్రదింపులు జరిపారు. అన్ని సంప్రదింపులు పూర్తయ్యాక వారి రాజీనామాలకు ఆమోదు ముద్ర వేశారు. దీనిపై లోక్‌సభ సభాపతి కార్యాలయం బులిటెన్ విడుదల చేసింది. ఐదుగురు ఎంపీల రాజీనామాలు అమలులోకి రానున్నాయని బులిటెన్‌లో పేర్కొన్నారు.













