ఘనంగా ముగిసిన లేపాక్షి ఉత్సవాలు
అనంతపురం జిల్లాలో నిర్వహించిన లేపాక్షి నంది ఉత్సవాలు ఆదివారం రాత్రి ఘనంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి వేలసంఖ్యలో పర్యాటకులు పోటెత్తారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామీణ క్రీడలతో పాటు కళాకారుల నృత్యాలు, సంస్కృతిక కార్యక్రమాలు చూడటానికి వచ్చిన వారితో నంది విగ్రహం నుంచి నవోదయ పాఠశాల వరకు సుమారు 2 కి.మీ మేర రహదారి కిటకిటలాడింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ప్రభుత్వం కూడా కళలు, క్రీడలను ప్రోత్సహిస్తోందని చెప్పారు. ప్రముఖ కన్నడ సినీనటుడు శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ నందమూరి తారకరామరావు, రాజ్‌కుమార్ మంచి స్నేహితులని, అప్పటి నుంచి ఇప్పటివరకు వారి వారసులమైన తమమధ్య కూడా సత్సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయని చెప్పారు. ముగింపు వేడుకల్లో నృత్య ప్రదర్శనలు, గేయాలాపన, బాలకృష్ణ రూపకం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా శివరాజ్‌కుమార్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అంబికా కృష్ణ, ఆకాశవాణి తిరుపతి డైరెక్టర్, రచయిత నాగసూరి వేణుగోపాల్‌ను ఘనంగా సత్కరించారు.













