ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు
ఎన్నికలకు ముందు ఏపీలో తీవ్ర చర్చనీయాంశం అయిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దయింది. తాజాగా ఈ చట్టాన్ని రద్దుచేస్తూ ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో… జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా రద్దయినట్లయ్యింది. ఇకపై ఆ టాపిక్ ఏపీలో వినిపించకపోవచ్చు. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశంలో రెవిన్యూ శాఖామంత్రి అనగాని సత్యప్రసాద్.. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీంతో స్పందించిన స్పీకర్… ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు అంగీకరించేవారంతా ‘‘అవును’’ అనాలని సూచించారు. దీంతో.. సభ్యులంతా ఏకగ్రీవంగా ‘‘అవును’’ అన్నారు. బిల్లు రద్ధయ్యినట్లు స్పీకర్ ప్రకటించారు.
ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో ఈ అంశంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నా జగన్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లో, అతి విశ్వాసంతో ఉన్నట్లో కనిపించింది. మరోపక్క… ఈ చట్టం అమలు చేస్తే మీ భూములు మీవి కాకుండా పోతాయి, వాటిని జగన్ లాగేసుకుంటాడు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు చేసిన ప్రచారాన్ని ఏపీ ప్రజానికం బలంగా నమ్మేసింది. మరోవైపు వైసీపీ అంత బలమైన కౌంటర్లూ ఇవ్వలేకపోయింది. దీంతో ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఈ బిల్లు కూడా జగన్ పార్టీ ఓటమికి ముఖ్యకారణమని అంటారు.













