ఎమ్మెల్యే పదవికి కోనేటి ఆదిమూలం రాజీనామా..!?
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయల నాయకుల ప్రైవేటు వ్యవహారాలు ఇటీవలికాలంలో పబ్లిక్ లోకి వచ్చాయి. కొంతమంది నేతలు మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడంతో పాటు వాళ్ల రాసలీలలు కెమెరాలకు చిక్కి బహిర్గతమయ్యాయి. బాధితులే కొన్ని వీడియోలను బయటపెట్టగా.. మరికొన్ని లీక్ అయ్యాయి. ఏదైతేనేం నేతల పరువు పోయింది. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం.. ఓ మహిళతో రాసలీలలు సాగిస్తున్న వీడియో బయటికొచ్చింది. వెంటనే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీడీపీ. అయితే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయబోతున్నట్టు సమాచారం.
కోనేటి ఆదిమూలం చిత్తూరు జిల్లా సత్యవేడు నుంచి 2019లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయనకు వైసీపీ అధిష్టానం పార్టీ టికెట్ ఇవ్వలేదు. పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వల్లే తనకు టికెట్ దక్కలేదని ఆరోపించారు. చివరి నిమిషంలో ఆయన టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. కోనేటి ఆదిమూలం రాజకీయ జీవితం 1977లో కాంగ్రెస్ లో ప్రారంభమైంది. 2001లో టీడీపీలో చేరారు. 2014లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైసీపీ నుంచి, 2024లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకూ ఎదిగారు. ఇప్పుడు పార్టీ మహిళా నేతతో రాసలీలల కారణంగా దొరికిపోయారు.
ఆదిమూలం వ్యవహారాన్ని బాధిత మహిళే ప్రెస్ మీట్ పెట్టి మరీ వెల్లడించింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న టీడీపీ అధిష్టానం వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే ఇది కుట్ర అని.. వాస్తవాలు త్వరలోనే బయటికొస్తాయని కోనేటి ఆదిమూలం వెల్లడించారు. ఈ అంశంపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టారు. వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించినట్లు సమాచారం. ఇన్నాళ్లూ వైసీపీ నేతలకు సంబంధించిన ఇలాంటి వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. అప్పుడు టీడీపీ నేతలు వైసీపీ వాళ్లపై సెటైర్లు వేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు టీడీపీకి కూడా ఈ మచ్చ అంటుకుంది.
ఇలాంటి వ్యవహారాలపై కఠిన చర్యలు తీసుకోవాలనే దిశగా చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన చేత ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ఇక్కడ ఉపఎన్నిక రావడం తథ్యం. ఇలా చేయడం ద్వారా నేతలకు గట్టి సంకేతాలు ఇచ్చినట్లవుతుందని.. భవిష్యతుల్లో నేతలు ఇలాంటి పాడుపనులకు దూరంగా ఉంటారని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. మూడు నెలలు తిరగకముందే ఓ ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సి రావడం ఇబ్బందికరమే అయినా పార్టీని దృష్టిలో పెట్టుకుని కఠిన నిర్ణయం తీసుకోక తప్పదనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది.













