నాని ధైర్యం వెనక..?
కొన్నాళ్లుగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఎంపీ కేశినేని నాని.. బెజవాడ నాదేనన్నారు. మూడోసారి ఎంపీగా పోటీ చేసి గెలుస్తానన్నారు. టీడీపీ నేత బేగ్ పుట్టినరోజు పార్టీలో నాని చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలంరేపుతున్నాయి. అంతేకాదు కొందరు తనను గొట్టంగాళ్లు అంటూ కామెంట్ చేశారని.. ఆ గొట్టం గాళ్ల గెలుపుకోసం కూడా తాను పనిచేస్తున్నానన్నారు. ఇప్పుడు నాని వ్యాఖ్యలపై టీడీపీలో లోతైన చర్చే జరుగుతోంది.
బెజవాడ పార్లమెంట్ పరిధిలో కేశినేని నాని సోదరుడు చిన్ని పార్టీ కార్యకలాపాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎంపీ సీటు చిన్నికి అధిష్టానం ఇస్తుందన్న ప్రచారం నేపధ్యంలో నాని కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. కేశినేని చిన్ని, బుద్ధా వెంకన్న, బోండా ఉమా, దేవినేని ఉమా, నాగుల్ మీరా జట్టుగా సాగుతున్నారు. వీరితో నానికి అస్సలు పడడం లేదు. నిజానికి నాని తాను కానీ కూతురు కాని ఎన్నికల్లో నిలబడాలని భావించారు. అయితే సొంత తమ్ముడి రూపంలో ప్రత్యర్థి ఎదురు కావడంతో నానిలో అసంతృప్తి పెల్లుబుకుతోంది. అది కాస్తా అప్పుడప్పుడూ అలా బయటపడుతోందని ఆఫ్ ద టాక్ గా వినిపిస్తోంది.
ఇటీవలి కాలంలో నాని వైసీపీ నేతలతో కలిసి తిరుగుతున్నారు. వారి ఆహ్వానం మేరకు ఫంక్షన్లకు సైతం హాజరవుతున్నారు. అంతే కాదు.. ఎవరు అభివృద్ధి చేసినా ప్రశంసించాల్సిందే అంటూ..పనిలో పనిగా వైసీపీనేతలను ప్రశంసిస్తున్నారు. ఈపరిణామాలతో నాని రూటెటు అన్న చర్చ కూడా పార్టీలో మొదలైంది. తమ్ముడు చిన్నకి సీటిచ్చినా సరే.. నాని పనిచేసే అవకాశం లేదన్న అంశంపై జోరుగా ప్రచారం జరుగుతోంది.
అంటే.. నానికి వైసీపీ నేతల నుంచి ఏమైనా హామీ లభించిందా? చంద్రబాబు సీటు ప్రకటించకున్నా.. తాను పోటీ చేస్తానని నాని ఎలా ప్రకటించారు. ? మూడోసారి గెలుస్తానని ఎలా చెబుతున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా? ఓవేళ అలా పోటీ చేస్తే, వైసీపీ సహకరిస్తుందా..? అంటే నానికి వైసీపీ నేతలు, హైకమాండ్ నుంచి అలాంటి సంకేతాలున్నాయా..? విజయవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.













