టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే
మాజీ ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు మాజీ సభ్యురాలు కాండ్రు కమల తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఆమె తన వియ్యంకుడు, మాజీమంత్రి మురుగుడు హనుమంతరావుతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో కలుసుకున్నారు. పార్టీలో చేరేందుకు తాను సుముఖంగా ఉన్నట్టు కమల ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. కమల పార్టీలో చేరడాన్ని ముఖ్యమంత్రి స్వాగతిస్తూ, ఓ మంచిరోజు చూసుకుని పార్టీలో చేరాలని సూచించారు. ఈ సందర్భంగా కమల తనకు పార్టీలో తగిన గుర్తింపును కల్పించాలని కోరగా, ముఖ్యమంత్రి నవ్వుతూ మీరు రాజకీయాల్లో సీనియర్, ఓ సీనియర్‌గా మీకు పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని చెప్పారు. కుటుంబ బాధ్యతల కారణంగా ఇన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందనీ, ఇప్పుడు బాధ్యతలన్నీ తీరిపోయినందున రాజకీయాల్లోకి వస్తున్నట్లు కమల తెలిపారు.













