ఆసుపత్రిలో చేరిన ఎంపీ అవినాష్ రెడ్డి
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తన తల్లి శ్రీలక్ష్మీతో పాటు కర్నూలు నగరంలోని విశ్వ భారతి ఆసుపత్రిలో చేరారు. శ్రీలక్ష్మికి ఛాతీనొప్పి రావడంతో పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో చేర్చించి చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించాలని భావించారు. దీంతో సీబీఐ విచారణకు హాజరుకావాల్సిన ఎంపీ అవినాష్ రెడ్డి హుటాహుటిన పులివెందుల బయలుదేరి వెళ్లారు. తాడిపత్రి మండలం చుక్కలూరు వద్దకు చేరుకోగానే శ్రీలక్ష్మి ప్రయాణిస్తున్న అంబులెన్స్ అవినాష్‌కు ఎదురైంది. వెంటనే వాహనం దిగిన అవినాష్ తల్లిని చూశారు. ఆమె ప్రయాణిస్తున్న అంబులెన్స్ వెంట తిరిగి హైదరాబాద్ వైపు బయలుదేరారు. మార్గ మధ్యలో కర్నూలు నగరంలోని విశ్వభారతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో తనకూ ఛాతీలో సమస్య తలెత్తిందని అవినాష్ రెడ్డి కూడా విశ్వభారతి ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. అయితే, అవినాష్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన ఆరోగ పరిస్థితి బాగానే ఉందని చెప్పినట్టు తెలిసింది.













