అక్టోబర్ నుంచి జనంలోకి…
అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అక్టోబర్ నాటికి తాను నటిస్తున్న సినిమాలు పూర్తవుతాయని, ఆ తర్వాత తన సమయంలో రెండొంతుల సమయం జనంలోనే గడుపుతానని తెలిపారు. జనం మధ్యలో ఉండి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి పోరాటం చేస్తామన్నారు. రాజకీయ లబ్ధి కోసం రాజకీయాలు చేయనని సృష్టం చేశారు. ఉద్దానం విషయంలో గత పాలకులు నిర్లక్ష్యం చేశారని, ప్రస్తుత ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవడం లేదని, విపక్షాలు స్పందించడం లేదని తాను రాజకీయం చేయవచ్చునని, కాని తాను ఆవిధంగా విభజన రాజకీయాలు చేయనన్నారు. రాజకీయం అంటే సమాజాన్ని కలిపేది కావాలని, విడగొట్టేది కాదన్నారు. ఉద్దానం విసయంలో ఇది మొదటి మెట్టని, అంతిమ లక్ష్యం సమస్యను రూపుమాపడేమనని సృష్టం చేశారు. ఇందుకు అన్ని ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసిరావాలన్నారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు, అనాథలుగా మారుతున్న పిల్లల బాధ్యతలను ప్రభుత్వమే స్వయంగా చేపట్టేందుకు ముందుకు రావడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు.సమాజాన్ని విభజించే రాజకీయాలు బాధ్యతా రాహిత్యమని పేర్కొన్నారు.













