జగన్ కంటే బొత్స సత్యనారాయణే తోపు..!!
ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆపసోపాలు పడుతోంది. అయితే 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి ఘన విజయం దక్కడంతో పెద్దల సభలో ఆ పార్టీకి బలమైన ప్రాతినిధ్యం లభించింది. ఇప్పుడు ఆ పార్టీని అదే కాపాడుతోందని చెప్పొచ్చు. పార్లమెంటులో రాజ్యసభ, రాష్ట్రంలో శాసన మండలిలో ఇప్పటికీ టీడీపీ కంటే వైసీపీకే ఎక్కువ బలముంది. ప్రభుత్వాన్ని శాసించగలిగిన స్థాయిలో ఆ పార్టీ ఉంది. ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మండలి పక్ష నేతగా ఆయన్ను నియమించారు వైఎస్ జగన్. దీంతో బొత్స సత్యనారాయణ ఇప్పుడు జగన్ కంటే ఎక్కువ బలవంతుడయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి. సాంప్రదాయం ప్రకారం కనీసం పది శాతం అంటే 18 సీట్లు దక్కి ఉంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఆ అవకాశం లేకపోవడంతో పార్టీ అధినేత జగన్ అందరి ఎమ్మెల్యేల్లో ఒకడిగా మిగిలిపోయారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించుకున్నా పట్టించుకోలేదు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ప్రతిపక్ష నేత హోదా వస్తే కేబినెట్ ర్యాంక్ దక్కుతుంది. ప్రోటోకాల్ పాటిస్తారు. అది లేకపోతే ఎమ్మెల్యేగా ఉండిపోవాల్సి వస్తుంది. దీన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు.
అయితే బొత్స సత్యనారాయణ మాత్రం ఈ విషయంలో లక్కీ అని చెప్పొచ్చు. ఎమ్మెల్యేగా బొత్స సత్యనారాయణ ఓడిపోయారు. ఇంతలోనే మండలిలో ఒక స్థానానికి ఎన్నిక రావడంతో వ్యూహాత్మకంగా బొత్స సత్యనారాయణను బరిలోకి దింపారు జగన్. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే ఊపులో ఆయన ఏకంగా శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా కూడా ఎంపికయ్యారు. గతంలో లేళ్ల అప్పిరెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించిన జగన్.. ఆయన్ను తప్పుకోమని చెప్పారు. దీంతో ఆయన తప్పుకున్నారు. ఆ బాధ్యతలను బొత్స సత్యనారాయణకు కట్టబెట్టారు. దీంతో బొత్స సత్యనారాయణకు ప్రతిపక్షనేతగా గుర్తింపు దక్కించుకున్నారు.
ప్రోటోకాల్ ప్రకారం ఇప్పుడు జగన్ కంటే బొత్స సత్యనారాయణకే విలువ ఎక్కువ. ఆయనకు ప్రభుత్వ కార్యక్రమాల్లో గుర్తింపు దక్కుతుంది. కేబినెట్ కు సరసమానమైన హోదా ఉంటుంది. కానీ జగన్ మాత్రం ఎమ్మెల్యేగా ఉండిపోయారు. దీంతో బొత్స సత్యనారాయణ అదృష్టవంతుడని అందరూ చెప్పుకుంటున్నారు. బొత్స విషయంలో జగన్ కూడా మంచి నిర్ణయం తీసుకున్నారని కొనియాడుతున్నారు. ఇప్పటిదాకా లోక్ సభ, రాజ్యసభ, అసెంబ్లీ, శాసనమండలిలో పార్టీ పక్షనేతగా రెడ్లు మాత్రమే ఉంటూ వచ్చారు. కానీ ఈసారి బీసీకి చెందిన బొత్సకు ఇవ్వడం మంచి నిర్ణయమని స్వాగతిస్తున్నారు.













