YSRCP: మెడికల్ కాలేజీలపై మరింత పోరు.. జగన్ యాక్షన్ ప్లాన్

ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల (Medical Colleges) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) తమ ఆందోళనను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ అధినేత వై.ఎస్. జగన్ (YS Jagan) మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కీలక నేతల సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
తమ హయాంలో మంజూరైన మెడికల్ కాలేజీల్లో కొన్నింటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడాన్ని వైసీపీ తప్పుబడుతోంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తోంది. ఇప్పుడు దీన్ని మరింత ఉధృతం చేసే దిశగా యాక్షన్ ప్లాన్ ప్రకటించింది. ఈ నెల 9న వై.ఎస్. జగన్ స్వయంగా నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శిస్తారు. అక్టోబరు 10 నుంచి నవంబర్ 22 వరకూ రాష్ట్రవ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమాన్ని చేపడతారు. ఈ కార్యక్రమం ద్వారా కోటి సంతకాలను సేకరించాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి కనీసం 500 మందితో సంతకాలు సేకరించాలని ఆదేశించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రూపొందించిన కరపత్రాలను అందరికీ పంపిణీ చేయాలని జగన్ సూచించారు. ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త ప్రతిరోజూ రెండు గ్రామాలను సందర్శించాలని ఆదేశించారు. నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలని కోరారు.
ఆందోళనలో భాగంగా ముఖ్యమైన తేదీల్లో భారీ ర్యాలీలు, డిమాండ్ పత్రాల సమర్పణ కార్యక్రమాలు జరగనున్నాయి. అక్టోబరు 28న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేపడతారు. ర్యాలీ అనంతరం, నియోజకవర్గ స్థాయిలో ఉన్న అధికారికి తమ డిమాండ్ పత్రాలను సమర్పిస్తారు. నవంబర్ 12న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు జరుగుతాయి. ఈ ర్యాలీలలో ఏదో ఒక జిల్లాలో తాను కూడా పాల్గొంటానని వై.ఎస్. జగన్ ప్రకటించారు.
నవంబర్ 23న నియోజకవర్గ కేంద్రాల నుంచి సేకరించిన సంతకాల పత్రాలు జిల్లా కేంద్రానికి చేరుకోవాలని పార్టీ ఆదేశించింది. నవంబర్ 24న సేకరించిన సంతకాలతో కూడిన వాహనాలను జిల్లా కేంద్రంలో జెండా ఊపి విజయవాడకు పంపించాల్సి ఉంటుంది. ఇలా సేకరించిన కోటి సంతకాల పత్రాలను గవర్నర్ కు అప్పగించనున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జగన్ మరింత ఉధృతంగా ఆందోళన చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇది మరింత వేడి రాజేసే అవకాశం కనిపిస్తోంది.