Tirupati :తిరుపతిలో ఘనంగా ప్రారంభమైన టెంపుల్ ఎక్స్పో
ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి (Tirupati)లో ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్పో ప్రారంభోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్(Devendra Fadnavis), గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ (Pramod Sawant) పాల్గొన్నారు. ఈ ఎక్స్‌పోలో భాగంగా నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు, వర్క్‌షాపులు జరగనున్నాయి.
టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో అంత్యోదయ ప్రతిష్టాన్ సహకారంతో తిరుపతిలో ఆశ కన్వెన్షన్ సెంటర్లో అంతర్జాతీయ దేవాలయాల సమావేశ ఎక్స్పో కొనసాగనుంది. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ (Shripad Nayak), తిరుపతి జిల్లా ఇంఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కన్వెన్షన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) హార్దిక అభినందనలు తెలుపుతూ రాసిన లేఖను నిర్వాహకులు చదివి వినిపించారు.













