GV Reddy: జీవీ రెడ్డి విషయంలో టీడీపీ ఆత్మవిమర్శ చేసుకుంటుందా?
రాజకీయాల్లో సిద్ధాంతాలు, విలువలు మాట్లాడేవారు కనుమరుగవుతున్న రోజులివి. ఇలాంటి సమయంలో మాజీ ఉపరాష్ట్రపతి, రాజకీయ భీష్ముడు ఎం.వెంకయ్య నాయుడు స్వయంగా ఓ మాజీ యువనేత కార్యాలయానికి వెళ్లి అభినందించడం సాధారణ విషయం కాదు. టీడీపీ మాజీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డిని వెంకయ్య నాయుడు పరామర్శించిన తీరు, చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో, ఆ పార్టీ సానుభూతిపరుల్లో పెద్ద చర్చకే దారితీశాయి. “జీవీ రెడ్డి లాంటి వ్యక్తి పార్టీని వీడటం ఆ పార్టీకే నష్టం.. ఆయనకు కాదు” అని వెంకయ్య చేసిన వ్యాఖ్యలు టీడీపీ అధిష్టానానికి పరోక్ష చురకలుగానే భావించారి.
జీవీ రెడ్డి న్యాయవాద వృత్తిని తిరిగి చేపట్టిన తర్వాత వెంకయ్య నాయుడు ఆయన్ను కలవడం కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే కాదు. “విషయం ఉన్నవాడు.. విచక్షణతో మాట్లాడేవాడు” అంటూ జీవీ రెడ్డిని వెంకయ్య కీర్తించారు. ఒకప్పుడు ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్న సమయంలో, ఎక్కడా సంయమనం కోల్పోకుండా, బూతులు మాట్లాడకుండా, కేవలం పాయింట్ టు పాయింట్ లాజిక్‌తో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన జీవీ రెడ్డి శైలి తనకు నచ్చిందని వెంకయ్య చెప్పడం గమనార్హం. వెంకయ్య నాయుడు లాంటి నిఖార్సైన రాజకీయవేత్త నుండి ఈ సర్టిఫికెట్ రావడం జీవీ రెడ్డి నైతిక విజయంగా చెప్పుకోవచ్చు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక జీవీ రెడ్డికి ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి దక్కింది. అక్కడ జరిగిన అవకతవకలను ఆయన వెలికి తీశారు. ఛైర్మన్ గా ఉన్నా కూడా ఆయన మాటను నెగ్గనీయకుండా అధికార యంత్రంగం కుట్ర చేసింది. ఆయన అడిగిన సమాచారం ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేసింది. విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా పురోగతి కనిపించలేదు. దీంతో ఆయన కొద్దిరోజులకే దానికి రాజీనామా చేశారు. దీనికి ప్రధాన కారణం సిద్ధాంతపరమైన విభేదాలు, స్వేచ్ఛ లేకపోవడమే.
కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్నాయని, వాటిని సమర్థించలేక ఆయన ఇబ్బంది పడినట్లు సమాచారం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ గొంతుకగా నిలిచిన తనకు, అధికారంలోకి వచ్చాక తగిన స్వేచ్ఛ, గౌరవం దక్కలేదన్న ఆవేదన ఆయనలో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతుంటారు. తాను కేవలం ఒక పదవిని అలంకరించే వ్యక్తిగా ఉండలేనని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్న తన తపనకు పార్టీ అధిష్టానం నుండి సరైన సహకారం లభించలేదన్నది బహిరంగ రహస్యం.
నేటికీ సోషల్ మీడియాలో “We Miss You GV Reddy” అనే పోస్టులు కనిపిస్తుంటాయి. దీనికి కారణం 2019-2024 మధ్యకాలంలో ఆయన పోషించిన పాత్ర. వైసీపీ నేతల దూకుడును, సోషల్ మీడియా ట్రోలింగ్‌ను తట్టుకుని, ఎంతో హుందాగా పార్టీ వాదనను వినిపించిన కొద్దిమందిలో జీవీ రెడ్డి అగ్రగణ్యుడు. చదువుకున్న విజ్ఞులైన ఓటర్లను, తటస్థులను టీడీపీ వైపు ఆకర్షించడంలో ఆయన పాత్ర కీలకం. “తిట్టేవాడు కాదు.. విషయం చెప్పేవాడు కావాలి” అని కోరుకునే యువతకు జీవీ రెడ్డి ఒక ఐకాన్‌లా మారారు. అందుకే ఆయన రాజీనామాను క్యాడర్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది.
ఇంతటి ఆదరణ ఉన్న నేతను వదులుకోవడానికి టీడీపీ హైకమాండ్ ఎందుకు సిద్ధపడింది? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. రాజకీయాల్లో అవసరమైనప్పుడు కఠినంగా ఉండాలి, ప్రత్యర్థిపై విరుచుకుపడాలి అనే నయా రాజకీయ పంథాకు జీవీ రెడ్డి సరిపోరని అధిష్టానం భావించిందా? జీవీ రెడ్డి లాంటి విద్యావంతులు, స్వతంత్ర భావాలు కలిగిన వారు ‘యస్ బాస్’ సంస్కృతికి ఇమడలేరు. పార్టీ లైన్‌ను గుడ్డిగా ఫాలో అవ్వకుండా, తప్పును తప్పు అని ఎత్తిచూపే తత్వం అధినేతలకు లేదా వారి కోటరీకి నచ్చకపోవచ్చు. క్రేజ్ ఉన్న నేత ఎదుగుతుంటే, అక్కడ ఉన్న సీనియర్లకు లేదా స్థానిక ఎమ్మెల్యేలకు వచ్చే అభద్రతా భావం కూడా ఇక్కడ పనిచేసి ఉండవచ్చు.
వెంకయ్య నాయుడు చెప్పినట్లు, జీవీ రెడ్డి ఇప్పుడు న్యాయవాదిగా తన కెరీర్‌ను విజయవంతంగా మలుచుకుంటున్నారు. కానీ, ఆయన నిష్క్రమణ టీడీపీకి ఒక హెచ్చరిక లాంటిది. విషయ పరిజ్ఞానం ఉన్నవారిని, హుందాగా వ్యవహించేవారిని పార్టీ దూరం చేసుకుంటే, భవిష్యత్తులో మేధావి వర్గం పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉంది. వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు టీడీపీ అధిష్టానాన్ని ఆలోచనలో పడేస్తాయో లేక లైట్ తీసుకుంటారో చూడాలి. కానీ, ఒక్కటి మాత్రం నిజం జీవీ రెడ్డి రాజకీయాల నుండి తప్పుకోవడం వ్యక్తిగతంగా ఆయనకు ప్రశాంతతను ఇవ్వొచ్చు, కానీ హుందాతనంతో కూడిన రాజకీయాలకు అది కచ్చితంగా తీరని లోటే.






