అమరావతిలో హ్యాపీ సిటీస్ సమ్మిట్
స్విట్జర్లాండ్లోని దావస్లో ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సు తరహాలో అమరావతిలో ప్రతి సంవత్సరం అంతర్జాతీయ స్థాయిలో ఆనంద నగరాల సదస్సు (హ్యాపీ సిటీస్ సమ్మిట్) నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తొలి సదస్సు ఏప్రిల్ 10 నుంచి 12 వరకు మూడు రోజులపాటు జరుగుతుంది. విజయవాడలోని భవానీద్వీపంలోగానీ, పవిత్రసంగమం వద్ద గానీ సదస్సు నిర్వహించాలని భావిస్తున్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)తో కలిసి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) దీనికి ఏర్పాట్లు చేస్తోంది. విశాఖలో అగ్రిటెక్ సదస్సు నిర్వహణలో పాలుపంచుకున్న కన్సల్టెన్సీ సంస్థ డాల్బెర్గ్ను ఈ సదస్సుకు విజ్ఞాన భాగస్వామి, సమన్యయకర్తగా ప్రభుత్వం నియమించింది. ఈ సదస్సుకు సంబంధించిన వివరాలతో సీఆర్డీఏ ఇప్పటికే వెబ్ఐసైట్ ప్రారంభించింది.













