వైభవంగా పరిటాల కుమార్తె వివాహ వేడుక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత కుమార్తె స్నేహలత, హర్షల వివాహ వేడుక అనంతపురం జిల్లా వెంకటాపురంలో ఘనంగా జరిగింది. దివంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర స్వగ్రామం వెంకటాపురంలో భారీ సెట్టింగ్‌తో వేదిక ఏర్పాటు చేశారు. బంధువులు, పరిటాల అభిమానులు, రాజకీయ ప్రముఖుల మధ్య ఘనంగా వివాహం జరిగింది. పెళ్లి కుమార్తె స్నేహలతను ఆమె సోదరులు పరిటాల శ్రీరామ్, సిద్దార్థలు ఇంటి నుంచి పెళ్లి వేదిక వద్దకు హంసవాహన పల్లకిలో తీసుకొచ్చారు. భారీగా ఏర్పాటు చేసిన చలువ పందిళ్లకింద అతిథులు ప్రత్యేకంగా కూర్చోవడానికి ఏర్పాట్లు చేయడంతో దాదాపు 30 వేల మంది వరకు వివాహ వేడుకను తిలకించారు. రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, శిద్దా రాఘవరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కాలువ శ్రీనివాసులు, సుజయ్‌కృష్ణ రంగరావు, అమర్నాథ్రెడ్డి, ప్రతిపాటి పుల్లారావుతో పాటు సినీ ప్రముఖులు మంచు మనోజ్ తదితరులు వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాక నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన అతిథులతో వెంకటాపురం గ్రామం కిక్కిరిసింది.













