రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుంది : గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. విద్యాప్రమాణాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నవరత్నాలతో సంక్షేమ పాలన అందుతోందని చెప్పారు. డీబీటీ ద్వారా అవినీతి లేకుండా నేరుగా లబ్దిదారులకే సొమ్ము అందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడుతో పాఠశాలల ఆధునీకరణ చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమం కింద తొలి విడతలో రూ.3669 కోట్లలో 15.717, రెండో విడతలో రూ.8,345 కోట్లతో 22,345 స్కూళ్లు అభివృద్ధి చేశారన్నారు. అమ్మఒడి కింద రాష్ట్రవ్యాప్తంగా 44 లక్షల మంది తల్లులకు రూ.15 వేలు చొప్పున రూ.9900 కోట్లు అందించినట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలతో ప్రజల వద్దకే పాలన అందిస్తున్నట్లు తెలిపారు.













