Google: అమరావతిలో గూగుల్ ఆశయాలకి శ్రీకారం..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో (Amaravati) ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గూగుల్ (Google) సంస్థ తన పరపతిని విస్తరించాలనే ఆలోచన చేస్తుందనే సమాచారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల గూగుల్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన భేటీ ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు రప్పించాలనే లక్ష్యంతో, ప్రపంచ దిగ్గజ సంస్థలు అమరావతిని పరిశీలించేలా చేస్తున్న కృషిలో ఇది ఒక భాగం.
ఈ నేపథ్యంలో గూగుల్ ప్రతినిధులు అమరావతిలో పర్యటించి కొన్ని ప్రాంతాలను పరిశీలించారు. ముఖ్యంగా అనంతవరం (Ananthavaram) నుంచి నెక్కల్లు (Nekkallu) వరకు ఉన్న రోడ్ పక్కన ఉన్న ప్రాంతంలో 143 ఎకరాల భూమిని ప్రభుత్వం గుర్తించి, సంస్థకు కేటాయించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడి భౌగోళిక పరిస్థితులు, సమీపంలో అభివృద్ధి కాబోతున్న విమానాశ్రయం (Airport) మరియు రైల్వే స్టేషన్ (Railway Station) వంటి మౌలిక వసతుల గురించి గూగుల్ ప్రతినిధులకు వివరించడంతో, వారు ప్రాథమికంగా ఆసక్తి చూపినట్టు సమాచారం.
అయితే గూగుల్ సంస్థ ఇక్కడ ఏ ప్రాజెక్టును నెలకొల్పబోతోందనే అంశంపై స్పష్టత రాలేదు. కానీ సంస్థ గతంలో తీసుకున్న నిర్ణయాల తీరు చూస్తే, వారు భవిష్యత్ అవసరాలను ముందుగానే అంచనా వేసి ప్రణాళికలు సిద్ధం చేయడం సాధారణం. అలాంటి దృక్పథంలోనే అమరావతిని పరిశీలిస్తుండవచ్చు. ప్రస్తుతం చూపిన స్థలంలో మౌలిక వసతులు పూర్తిగా లేకపోవడం, భవనాలెక్కడమి లేకపోవడం వంటి అంశాలు ఉన్నప్పటికీ, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు పదేళ్లు ముందుగా ప్రాజెక్టుల కోసం స్థలాలను పరిశీలించడం తరచుగా కనిపించే విషయం.
అమరావతిలో గూగుల్ ఒక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే, రాష్ట్రానికి ఆర్థికంగా గట్టి బలమే కాకుండా, దేశవ్యాప్తంగా ఇతర సంస్థలకు కూడా ఇది ప్రేరణగా నిలుస్తుంది. ఒకవేళ గూగుల్ అధికారికంగా సంస్థ స్థాపన గురించి ప్రకటిస్తే, మిగిలిన అనేక అంతర్జాతీయ కంపెనీలు కూడా అమరావతిపై దృష్టి సారించవచ్చు. ప్రస్తుతం ఈ అంశంపై స్పష్టత లేకపోయినా, ముందు చూపుతో తీసుకునే నిర్ణయాలు వలన భవిష్యత్తులో అమరావతికి ఒక ప్రత్యేక గుర్తింపు రావడం ఖాయం. మరి ఈ క్రమంలో గూగుల్ నిండు రంగుల కలను అమరావతికి అందిస్తుందా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.