అవినాష్ ను కాదని రవీంద్రను రంగంలోకి దించిన జగన్ అసలు స్కెచ్ ఏమిటో?
కడప గడ్డ వైఎస్ కుటుంబానికి అడ్డా అన్న విషయం అందరికీ తెలిసిందే. రూలింగ్ లో ఏ పార్టీ ఉన్నా.. కడపలో గెలుపు మాత్రం రాజశేఖర్ రెడ్డి కుటుంబీకులకే చెందుతుంది. అందుకే జగన్ కి కడప ఎంతో ముఖ్యమైన నియోజకవర్గం. 2024 ఎన్నికల్లో కూటమి తుఫానులో కూడా జగన్ కడప నియోజకవర్గం లో గెలిచింది ఆ ప్రజాబలం మీదే. ఇప్పటిదాకా ఆయన కడప రాజకీయాన్ని తమ్ముడు అవినాష్ రెడ్డి పై నమ్మకంతో జరుపుతూ వచ్చారు.. కానీ ఈసారి తన రూట్ మారుస్తూ కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రా రెడ్డిని వైఎస్సార్ కడప జిల్లా కొత్త ప్రెసిడెంట్ గా నియమించారు.
రవీంద్రా రెడ్డి 1999లో కాంగ్రెస్ తరఫున చింతకొమ్మదిన్నె జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 2004లో కడప నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ గా గెలిచారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్ స్థాపించిన వైసీపీ పార్టీలోకి వచ్చి చేరారు. కడప రాజకీయాలపై ఆయనకు అపారమైన పట్టు ఉంది.. రవీంద్రా రెడ్డికి జగన్ కమలాపురం ఎమ్మెల్యేగా టికెట్ కూడా ఇచ్చారు. అలా 2014, 2019 రెండుసార్లు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా రవీంద్రారెడ్డి గెలిచారు.
రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న వ్యక్తే అయినప్పటికీ ఇప్పటివరకు రవీంద్రా రెడ్డికి జగన్ పార్టీ పరంగా ఎటువంటి బాధ్యతలు అప్పగించలేదు. కానీ మొదటిసారి మేనమామపై నమ్మకంతో తనకు ఎంతో కీలకమైన కడపను ఆయన చేతిలో పెట్టారు. అవినాష్ రెడ్డి కడప పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి మెడ చుట్టూ ఉచ్చు ఎప్పుడైనా బిగుసుకునే అవకాశం ఉంది.
మరోపక్క షర్మిల కడపలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సృష్టించడం కోసం జగన్ పై విరుచుకుపడుతోంది. ఆమె దూకుడు నియంత్రించడం అంత సులభం కాదు. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా జగన్ కు కడప గడ్డపై ఎంత ఆదరణ ఉందో..అదే రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసురాలిగా షర్మిలకు కూడా అంతే పట్టు ఉంది. అందుకే సొంత జిల్లాను నమ్మకమైన వారి చేతిలో పెడితే మంచిది అని భావించిన జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రస్తుతం కడప ఎంపీగా వ్యవహరిస్తున్న అవినాష్ రెడ్డి.. హత్య కేసు విషయంలో ఇబ్బంది ఎదుర్కొన్నట్లయితే వెంటనే ఎంపీగా రవీంద్రా రెడ్డిని రీప్లేస్ చేసే అవకాశాలు ఉన్నాయి అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.













