కాంగ్రెస్ గూటికి కేంద్ర మాజీ మంత్రి కృపారాణి
కేంద్ర మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయకురాలు కిల్లి కృపారాణి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్యార్ జిల్లాలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పర్యటన సమయంలో ఆమె సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కృపారాణి మాట్లాడుతూ అవమానాలు, నియంతృత్వ ధోరణి భరించలేక వైసీపీ నుంచి బయటకు వచ్చానని తెలిపారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ముగింపు సమయంలో కాంగ్రెస్‌లో చేరారు. 2012 నుంచి 2014 వరకు కేంద్ర మంత్రిగా సేవలందించారు. 2018లో వైసీపీలో చేరిన ఆమెను అధిష్ఠానం పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా నియమించారు. రాష్ట్ర మంత్రివర్గం పునర్విభజన సమయంలో కృష్ణదాస్‌ను పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ కృపారాణిని తప్పించారు. వైసీపీలో అవమానాలు భరించలేక పార్టీని వీడుతున్నట్లు ఇటీవల ప్రకటించారు.













