దాని వల్ల మా పార్టీకి ఆదరణ పెరుగుతుంది.. తప్ప తగ్గదు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కుట్రపూరితమనే విషయం అందరికీ తెలుసని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబుతో ఆయన ములాఖాత్ అయ్యారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ న్యాయస్థానంలో కచ్చితంగా తమకు న్యాయం జరుగుతుందని తెలిపారు. జైలులో చంద్రబాబు మనోధైర్యం కోల్పోలేదు. దేశ వ్యవసాయ రంగానికి ఎంతో సేవ చేసిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ మృతికి సంతాపం తెలియజేయమని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రజలందరికీ, మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు.
వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని టీడీపీ శ్రేణులను కోరారు. టీడీపీకి వస్తున్న ప్రజాదరణ అణచివేయాలని అధికార పార్టీ చూస్తోంది. కానీ దాని వల్ల మా పార్టీకి ఆదరణ పెరుగుతుంది తప్ప తగ్గదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ వర్గమూ ఆనందంగా లేదు. నా సొంత భూమి కూడా ఇన్నర్ రింగ్‌రోడ్డులో పోయింది. 2001లో ఈడుపుగల్లులో ఉన్న 40 సెంట్ల సొంత స్థలం అది. దాని విలువ రూ.7 కోట్లు. సొంత భూమినే పొగొట్టుకున్న నేను అవినీతి చేస్తానా? కావాలనే బురద చల్లుతున్నారు. మాపై చేసే ఆరోపణల్లో నిజమేంటో కోర్టుల్లో తేలుతుంది. టీడీపీ, జనసేన పార్టీ కమిటీలు ఇచ్చే నివేదిక ప్రకారం ఉమ్మడి కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతాం అని అన్నారు.













