మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ ఇక లేరు

ఉమ్మడి ఆంధప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్వీ ప్రసాద్ కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1975 ఐఏఎస్ బ్యాచ్‍కు చెందిన అధికారి. నెల్లూరు జిల్లా సబ్‍కలెక్టర్‍గా ఎస్వీ ప్రసాద్ తన కెరీర్‍ను ప్రారంభించారు. అనంతరం 1982లో కడప, 1985లో విశాఖపట్నం జిల్లాల కలెక్టర్‍గా బాధ్యతలు నిర్వర్తించారు. 2010లో ముఖ్యమంత్రిగా రోశయ్య ఉన్నప్పుడు సీఎస్‍గా పనిచేశారు. తన కంటే 20 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులున్నా ఎస్వీ ప్రసాద్‍నే సీఎస్ పోస్టు వరించింది. పదేళ్లకు పైగా ముగ్గురు మ్యుమంత్రుల వద్ద ఎస్వీ ప్రసాద్ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించారు. నేదురుమల్లి జనార్దన్‍రెడ్డి, కోట్ల విజయభాస్కర్‍రెడ్డి, చంద్రబాబు హయాంలో ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు.
ఎస్వీ ప్రసాద్ మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‍రెడ్డి దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరిపాలనలో ఎస్వీ ప్రసాద్ తనదైన ముద్ర వేశారని జగన్ గుర్తు చేసుకున్నారు. ప్రసాద్ మృతి పట్ల సినీ నటుడు చిరంజీవి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.