నా ఇగో హర్ట్ అయ్యింది!
ఫేస్బుక్లో పోస్టింగ్‌లపై ఇంటూరి రవికిరణ్‌ను అరెస్ట్ చేసినప్పుడు నేను బాధపడ్డాను
మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు
బ్రాహ్మణ కార్పొరేషన్ వల్ల రాజకీయ మైలేజీ ఇవ్వడమంటే తెలుగుదేశానికి భజన చేయాలా? అది నా వల్ల కాదు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలతో నా ఇగో హర్ట్ అయ్యింది. అందువల్ల, ఇప్పుడు జరుగుతున్న ప్రచారంపై నేను ఫీల్ కావడం లేదు’’ అని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా వేటుపడిన మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై పూర్తిస్థాయిలో ఎదురుదాడికి దిగారు. ప్రభుత్వ పదవిలో ఉంటూ తాను చేసిన చర్యలను… ఇతర రాజకీయ పరిణామాలతో ముడిపెట్టి సమర్థించుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్బుక్లో పెట్టిన పోస్టులనూ సమర్థించుకున్నారు. ‘‘ముఖ్యమంత్రిని లగడపాటి కలవొచ్చు. కానీ, నేను వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతిని కలిస్తే తప్పా? వాళ్లు మాత్రం పరస్పరం కలవొచ్చు. ఇతరులు మాత్రం పార్టీని భుజాన మోయాలా? ఎంపీలు కేశినేని నాని, జేసీ దివాకర్ రెడ్డి ఎన్నో వ్యాఖ్యలు చేస్తుంటారు. వారిని వదిలేసి నేను ఫేస్బుక్లో పెట్టిన పోస్టులపై రాద్ధాంతం చేయడమేమిటి?’’ అని ఐవైఆర్ ప్రశ్నించారు. చంద్రబాబును కలిసి 5 నిమిషాలు మాట్లాడేందుకు ఆరు నెలలుగా అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలిపారు. సీఎంకు జవాబుదారీగా లేననే విమర్శలు సరికాదన్నారు. ‘‘నాలుగుసార్లు సీనియర్ అధికారులను కలిసి అడిగినా… సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కనీసం విమానంలోనైనా భేటీకి అవకాశం ఇవ్వాలని సీఎం పీఎ్సని కోరినా ఫలితం లభించలేదు. దీంతో నా ఇగో హర్ట్ అయ్యింది’’ అని ఐవైఆర్ వివరించారు. ‘‘సీఎ్‌సగా నేను రిటైర్ అయ్యాక సీఎం ఎన్నో అవకాశాలు ఇచ్చేందుకు ముందుకువచ్చారు. బ్రాహ్మణ సంక్షేమానికి ఏదో చేయాలనే ఉద్దేశంతో బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్‌గా చేసేందుకు అంగీకరించాను. నేను సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లపై విదేశాల నుంచి ఎవరెవరో ఫోన్లు చేసి ఎందుకలా చేశావని అడిగారు. ప్రభుత్వం నుంచి మాత్రం ఎవ్వరూ అడగలేదు. అడిగి ఉంటే సమాధానం చెప్పేవాడిని’’ అని తెలిపారు.
తప్పేముంది?
తాను ఏం తప్పు చేశానని ఇంత ప్రచారం చేశారో అర్థం కావడం లేదని ఐవైఆర్ విస్మయం వ్యక్తం చేశారు. ‘‘ఫేస్బుక్లో పోస్టింగ్‌లపై ఇంటూరి రవికిరణ్‌ను అరెస్ట్ చేసినప్పుడు నేను బాధపడ్డాను. నాకు వచ్చిన పొలిటికల్ సెటైర్లను పరిచయం ఉన్న 30, 40 మంది మిత్రులకు మాత్రమే పోస్ట్ చేశాను. ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఒక్క వారం రోజులే అలా జరిగింది. ఆ విషయంలో అప్పట్లోనే ఎవరైనా అడిగి ఉంటే సమాధానం చెప్పేవాడిని’’ అని ఐవైఆర్ వివరించారు. గౌతమిపుత్ర శాతకర్ణికి పన్ను మినహాయింపు సరికాదని ఇప్పుడూ చెబుతున్నానన్నారు. బాహుబలి-2కు థియేటర్ల కేటాయింపు, అనీల్ సింఘాల్‌ని టీటీడీ ఈవోగా నియమించడంపైనా పోస్ట్ చేశాను. టీటీడీ బాధ్యతల్ని ఇప్పటి వరకు దక్షిణ భారతదేశానికి చెందినవారే నిర్వహిస్తూ వచ్చారు. ఇప్పుడెందుకు మార్చాల్సి వచ్చింది?’’ అని ప్రశ్నించారు.
టీడీపీలోనే సమస్య…
బ్రాహ్మణ కార్పొరేషన్ పథకాలపై నియోజక వర్గాల్లో జరుగుతున్న సమావేశాలకు సంబంధించి వైసీపీ నేతలకు సమాచారం వెళ్తోందని, టీడీపీ వారికి వెళ్లడం లేదని ప్రచారం జరుగుతోందని ఐవైఆర్ అన్నారు. ‘‘జిల్లా కోఆర్డినేటర్ల నుంచి టీడీపీ ఎమ్మెల్యేలకు సమాచారం వెళ్లడంలేదంటే… ఆ పార్టీలోనే ఏదో సమస్య ఉంది’’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రచారానికి విశాఖపట్నం వెళ్లడాన్ని తప్పుబడుతున్నారని… టీడీపీకి బీజేపీ మిత్రపక్షమని గుర్తు చేశారు. తనకు కేబినెట్ హోదా లేదని, కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేస్తున్నా జీతం తీసుకోవడం లేదన్నారు. కొన్ని చిన్న సదుపాయాలే ప్రభుత్వం నుంచి వాడుకుంటున్నట్లు చెప్పారు.
రాజకీయాల ఆలోచన లేదు
ప్రస్తుతం రాజకీయాల్లో చేరాలనే ఆలోచన తనకు లేదని ఐవైఆర్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనేంత అర్థ, అంగబలం తనకు లేవన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు సంబంధించి ఎన్నో అంశాల్లో ప్రభుత్వానికి ఫైల్ పంపితే తిరిగి రాదని, తన స్థాయిలో పనులు చేయించుకున్నానని ఐవైఆర్ తెలిపారు. ‘‘బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికీ సీఎం సంతకం చేసిన పత్రం అందించాం. అర్హుల జాబితాను స్థానిక ఎమ్మెల్యేలకు ఎప్పటికప్పుడు పంపించాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. అన్నీ ఒకేసారి చెప్పను’’ అన్నారు.













