బ్యానర్లపై ముద్రించే వారి పేరు తప్పనిసరి.. ఎన్నికల సంఘం..
రాబోయే ఎన్నికలకి ఎక్కడా నియమాల ఉల్లంఘన జరగకుండా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా ఎక్కడ పడితే అక్కడ పెడుతున్న హోర్డింగ్ల విషయంలో కొత్త నిబంధన పాటించాలని సూచించింది. ఎన్నికల చట్టం ప్రకారం రాజకీయ హోర్డింగ్స్ పై పబ్లిషర్, ప్రింటర్ పేర్లు ఉండాలని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు బుధవారం నాడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శిలను ప్రధాన ఎన్నిక అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ అనూజ్ చండక్ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ప్రచారం కోసం అభ్యర్థులు చేస్తున్న ఖర్చును అంచనా వేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియపరిచారు.గత కొద్ది కాలంగా ప్రచురణ కర్తల పేర్లు లేకుండా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు.అయితే ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం కచ్చితంగా ప్రచురించే వ్యక్తి పేరు అందరికీ తెలియాలని ఎన్నికల సంఘం తెలిపింది.













