ED: ఏపీ లిక్కర్ స్కాం కేసులోకి ఈడీ..! చిక్కుముళ్లు వీడనున్నాయా..?

ఆంధ్రప్రదేశ్‌లో 2019-2024 మధ్య జరిగిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం (AP Liquor Scam) దేశంలోనే అతిపెద్దదిగా చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారంలో తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలోకి దిగడంతో కేసు కీలకమైన మలుపు తిరిగింది. శర్వాణి డిస్టిలరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డికి (Chandra Reddy) ఈడీ నోటీసులు జారీ చేసి, ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. దీంతో మనీ లాండరింగ్‌పై మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం విధానం అమలు చేసింది. దీని ద్వారా ఆటోమేటెడ్ ఆర్డర్ ఫర్ సప్లై (OFS) వ్యవస్థను తొలగించి, మాన్యువల్ ప్రక్రియను ప్రవేశపెట్టారు. ఇలా చేయడం ద్వారా నెలకు రూ. 50-60 కోట్ల లంచాలను డిస్టిలరీల నుంచి వసూలు చేసినట్లు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) గుర్తించింది. ఈ నిధులు హవాలా నెట్‌వర్క్‌లు, షెల్ కంపెనీల ద్వారా ఎన్నికల ఫండింగ్ కు, వ్యక్తిగత లాభాలకు ఉపయోగించినట్లు నివేదించింది. సిట్ దీనిపై ఇప్పటికే సమగ్రంగా దర్యాప్తు చేసి 305 పేజీల చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ చార్జ్‌షీట్ లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) అంతిమలబ్దిదారుగా పేర్కొంది. కానీ ఆయనను నిందితుడిగా చేర్చలేదు. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ కుంభకోణానికి సూత్రధారిగా ఉన్నాడని, ఆయన ద్వారా విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు డబ్బు బదిలీ జరిగిందని చార్జ్‌షీట్ వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటివరకు రాజంపేట ఎంపీ పీవీ మిథున్ రెడ్డితో సహా 12 మందిని సిట్ అరెస్టు చేసింది.
ఈ కేసులో ఈడీ జోక్యం చేసుకోవడం ఒక కీలక పరిణామం. ఇన్నాళ్లూ సిట్ దర్యాప్తు సాగుతుండగా, ఈడీ ఎందుకు జోక్యం చేసుకోలేదని తెలుగుదేశం పార్టీ (TDP) నేతలు ప్రశ్నించారు. బీజేపీ (BJP) వైసీపీని కాపాడుతోందనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే, ఈడీ ఇప్పుడు పీఎంఎల్‌ఏ కింద దర్యాప్తు ప్రారంభించడంతో ఈ అనుమానాలకు తెరపడినట్లయింది. శర్వాణి డిస్టిలరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డికి నోటీసులు జారీ చేయడం ద్వారా ఈడీ మనీ లాండరింగ్ ఆరోపణలపై దృష్టి సారించింది. ఈ దర్యాప్తు ద్వారా డబ్బు లావాదేవీలు, షెల్ కంపెనీల ద్వారా నిధుల బదిలీ, దుబాయ్, ఆఫ్రికాలో ఆస్తుల కొనుగోలు వంటి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
ఈ కేసు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత తదుపరి జగన్ రెడ్డి అరెస్టు అయ్యే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది. ఈడీ జోక్యంతో ఈ కేసు మరింత తీవ్రతరం కానుంది. ఈ దర్యాప్తు ద్వారా మరిన్ని అరెస్టులు, నిధుల బదిలీకి సంబంధించిన కీలక వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.