ముందస్తు జాగ్రత్తగా పెట్రోల్ బంక్ కు సరికొత్త ఆదేశాలు జారీ చేసిన ఎన్నికల సంఘం..
ఆంధ్రాలో ఎన్నికల సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. జూన్ 4 ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ముందస్తు జాగ్రత్త చర్యలు ఇప్పటినుంచే చేపడుతోంది. ఇబ్బందికరంగా ఉన్న నియోజకవర్గాలలో అధికారుల బదిలీ కూడా చేయడం జరిగింది. ముందస్తు జాగ్రత్త చర్యగా బాటిళ్లలో, కంటైనర్లలో పెట్రోల్ గానీ, డీజిల్ గానీ విక్రయించొద్దని పెట్రోల్ బంకుల నిర్వాహకులకు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 13న ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత పల్నాడు, మాచర్ల, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకపక్క పోలింగ్ జరుగుతున్న మరోపక్క కొన్ని ప్రదేశాలలో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ సంఘటనల పై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. విచారణ అనంతరం ఈ ఘటనకు బాధ్యులుగా భావించిన పలువురు ఉన్నతాధికారులను సస్పెండ్ చేసింది. ఓట్ల లెక్కింపు సమయంలో ముందస్తు జాగ్రత్తగా లెక్కింపు పూర్తయ్యే వరకు వాహనాలకు మాత్రమే పెట్రోల్, డీజిల్ నింపాలని ఆదేశాలు ఇచ్చింది. ఎట్టి పరిస్థితిలో బాటిళ్లలో పెట్రోల్ నింపొద్దని సూచించింది. నిబంధనలను ఉల్లంఘించినా..బాటిళ్లలో పెట్రోల్ నింపినా బంకు లైసెన్స్ ను రద్దు చేస్తామని ఈసీ హెచ్చరించింది..













