Pawan Kalyan: టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయుల హృదయాలు గెలుచుకున్న డిప్యూటీ సీఎం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన (Janasena) పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన రాజకీయ ప్రయాణంలోనే కాకుండా, వ్యక్తిగతంగా కూడా ప్రజలతో అనుబంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా తన సానుభూతిని, దాతృత్వాన్ని చూపిస్తూ ముందుంటారు. ఇటీవల రాఖీ పండుగ సందర్భంగా పిఠాపురం (Pithapuram) నియోజకవర్గంలోని వితంతు మహిళలకు చీరలు అందించి, “నేను మీకు సోదరుడిలా అండగా ఉంటాను” అని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఈసారి ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మళ్లీ తన మంచి మనసును తెలియజేశారు.
సెప్టెంబర్ 5న జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవానికి ముందుగానే, పిఠాపురం నియోజకవర్గంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ప్రత్యేక బహుమతులు పంపించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న వారికి ఆయన తరపున కానుకలు పంపిణీ అయ్యాయి. మహిళా టీచర్లకు చీరలు, పురుష ఉపాధ్యాయులకు ప్యాంటు, షర్టులు అందజేశారు. మొత్తం 2000 మంది ఉపాధ్యాయులకు ఈ బహుమతులు చేరాయి.
ఈ కానుకల పంపిణీని పిఠాపురం, గొల్లప్రోలు (Gollaprolu), కొత్తపల్లి (Kottapalli) మండలాల విద్యాశాఖ కార్యాలయాల్లో నిర్వహించారు. ప్రత్యేకంగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను గుర్తు పెట్టుకొని, వారికి బహుమతులు పంపడం ఉపాధ్యాయ వర్గాలను ఆనందపరిచింది. “ఎంత బిజీగా ఉన్నా మా గురించి గుర్తు పెట్టుకోవడం మాకు గౌరవంగా అనిపిస్తోంది” అని పలువురు టీచర్లు అభిప్రాయపడ్డారు.
పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగానే కాకుండా, ఒక ప్రజాప్రతినిధిగా తన ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల శ్రావణ మాసంలో పదివేల మంది మహిళలకు చీరలు, పసుపు, కుంకుమ అందించి, వారితో ఆప్యాయతను పంచుకున్నారు. అలాగే రాఖీ సందర్భంగా 1500 మంది వితంతువులకు బహుమతులు పంపి వారికి తాను సోదరుడిలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఇప్పుడీ వరుసలో 2000 మంది ఉపాధ్యాయులకు దుస్తులు పంపించడం ద్వారా, గురువుల పట్ల తనకున్న గౌరవాన్ని తెలియజేశారు. ఉపాధ్యాయ వృత్తిని సమాజ నిర్మాణానికి పునాది అని భావించే పవన్ కళ్యాణ్, వారికి కానుకలు అందించడం ద్వారా వారి సేవలను స్మరించుకోవాలన్న ఉద్దేశ్యాన్ని ప్రదర్శించారు.
ఇప్పటి వరకు పిఠాపురం నియోజకవర్గంలో ఏ నాయకుడు ఇంత విస్తృతంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఓటు వేసి గెలిపించిన ప్రజలను ఎప్పటికీ మర్చిపోని నాయకుడిగా ఆయన గుర్తింపు పొందుతున్నారు. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నా, ప్రజలతో అనుబంధాన్ని కొనసాగించడంలో పవన్ కళ్యాణ్ వెనుకడుగు వేయడం లేదు.
తన ప్రత్యేక శైలిలో బహుమతులు పంపిస్తూ, ప్రతి సందర్భాన్ని ప్రజలతో పంచుకోవడమే కాకుండా, రాష్ట్రంలోనే కొత్త సంప్రదాయానికి నాంది పలుకుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పిఠాపురం నుంచి ప్రారంభమైన ఈ పద్ధతి భవిష్యత్తులో ఇతర ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందే అవకాశముందని వారు అభిప్రాయపడుతున్నారు.