కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి.. ప్రత్యేక హోదా
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ తెలిపారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాహుల్ పాదయాత్ర ప్రవేశించనున్న నేపథ్యంలో కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, రాష్ట్రాల్లో పూర్తి చేసుకుని ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుందన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన ఆలూరు నియోజకవర్గం నుంచి మంత్రాలయం వరకు నాలుగు రోజుల పాటు 95 కి.మీ మేర ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. అనంతరం తెలంగాణలో 13 రోజుల పాటు యాత్ర జరుగుతుందని ఆయన తెలిపారు.













