నంద్యాల బరిలో కాంగ్రెస్ పోటీ
నంద్యాల శాసనసభ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి సృష్టం చేశారు. అభ్యర్థిని పార్టీలో చర్చించి త్వరలోనే ప్రకటిస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చాపరాయిలో కలుషిత నీరు తాగి 16 మంది చనిపోయారని, ఈ మరణాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే బాధ్యత వహించాలన్నారు. చనిపోయిన వారికి ఆర్థికసాయం ప్రకటించడంలో ముఖ్యమంత్రి ఒకమాట, ఉపముఖ్యమంత్రి మరో మాట మాట్లాడటం సరికాదన్నారు. దళితులను సంఘ బహిష్కరణ చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులు విభజన హామీల అమలుపై శ్రద్ద పెట్టకుండా శాసనసభ సీట్ల పెంపు కోసం ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన హక్కుల సాధనపై దృష్టి పెట్టాలన్నారు.













