కర్నల్ సంతోష్‌బాబు విగ్రహావిష్కరణ
గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కర్నల్ సంతోష్‌బాబు త్యాగానికి ప్రతీకగా పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కోన శ్రీనివాసరావు ఆర్థిక సహకారంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సంతోష్ బాబు విగ్రహాన్ని కోన శ్రీనివాసరావు ఆయన సోదరుడు హనుమాన్ బాబుతో కలిసి ఆవిష్కరించారు. తణుకు మండలం డువ్వలోని సీఎస్ శిల్పానిలయంలో శిల్పి చంద్రశేఖర్.. సంతోష్ బాబు విగ్రహాన్ని జీవ కళ ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. కోన శ్రీనివాసరావు ఇప్పటికే గ్రామంలో మహాత్మాగాంధీ, అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు, కాటం దొర విగ్రహాలను ఏర్పాటు చేశారు. తాజాగా కర్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆవిష్కరించడం విశేషం.













