ఏలూరు బాధితులకు సీఎం జగన్ పరామర్శ
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాధితులను ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి బాధితుల బాగోగుల గురించి ఆరా తీశారు. బాధితులకు అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి జగన్. అస్వస్థతకు దారి తీసిన కారణాలు.. ఇప్పటివరకు చేసిన పరీక్షల వివరాలు తెలుసుకున్నారు. ఇక బాధితులందరి రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. బాధితుల్లో అన్ని వయసుల వారు ఉన్నారని, ఏలూరు అర్బన్‌తో పాటు రూరల్, దెందులూరులో కూడా కేసులు గుర్తించామన్నారు. ఇప్పటికే ఎయిమ్స్ నుండి డాక్టర్ల బృందం వచ్చిందని, ఐఐసీటీ, ఎన్ఐఎన్, ఐసీఎంఆర్ బృందాలు వస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
డిశ్చార్జ్ చేసిన వారు తిరిగి మళ్లీ ఆస్పత్రికి వస్తున్నారా లేదా అని అధికారులను ప్రశ్నించిన ముఖ్యమంత్రి, వారికి ఆహారం, మందులు అందించాలని, డిశ్చార్జ్ అయిన వారిని కూడా అబ్జర్వేషన్లో ఉంచాలని అధికారులకు సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు ఏలూరులో అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. ప్రజలకు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా 104, 108కి కాల్ చేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు.













