50 బెడ్లు దాటిన ఆస్పత్రులకు సీఎం జగన్ డెడ్ లైన్

50 బెడ్లు దాటిన ప్రతి ఆస్పత్రిలో కచ్చితంగా ఆక్సిజన్ సౌకర్యం ఉండాల్సిందేనని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అలాంటి ఆస్పత్రుల్లో ఆగస్టు చివరి కల్లా ఆక్సిజన్ జనరేషన్ ఏర్పాట్లు పూర్తి కావాలి డెడ్‌లైన్ విధించారు. అలాగే ఆయా ఆస్పత్రుల్లో కాన్సన్‌ట్రేటర్లు కూడా ఉండాలని, సొంతంగా ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టుకునే ప్రైవేట్ ఆస్పత్రులకు 30 శాతం ఇన్సెంటివ్ ఇవ్వాలని పునరుద్ఘాటించారు. వారు కూడా ఆగస్టు చివరి కల్లా ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పరిస్థితులపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్లాక్ ఫంగస్ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంజెక్షన్లు తెప్పించుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.
వైట్, ఎల్లో ఫంగస్ ల సమాచారం కూడా వస్తోందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. యాస్ తుపాను నేపథ్యంలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, రోజు వారీగా కావాల్సిన ఆక్సిజన్‌ను సరఫరా చేయడంతో పాటు నిల్వలపై ఓ కన్నేసి ఉంచాలన్నారు. యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల ఆస్పత్రుల నుంచి కోవిడ్ రోగుల తరలింపుపై తగిన చర్యలు తీసుకోవాలని, వారిని ఏ ప్రాంతాలకు తరలించాలన్న దానిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. రోగులకు ఇచ్చే ఆహారం, పారిశుద్ధ్యం అన్నీ నాణ్యంగా ఉండాలని, రోగులకు మంచి సేవలు అందించేలా ఆస్పత్రులు ఉండాలని జగన్ అభిలషించారు.