ఇనార్బిట్ మాల్ కు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన
రహేజా గ్రూప్ నిర్మించనున్న ఇనార్బిట్ మాల్ నిర్మాణం పూర్తయితే విశాఖకు అంతర్జాతీయంగా మరింత గుర్తింపు వస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఇనార్బిట్ మాల్‌కు శంకుస్థాపన చేశారు. తొలుత విశాఖ విమానాశ్రయం నుంచి కైలాసపురంలోని పోర్టు ఆసుపత్రి వద్ద మాల్ నిర్మిత ప్రాంగణానికి చేరుకొని శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ మాల్ నిర్మాణం విశాఖ అభివృద్ధికి మరింత దోహదపడుతుంది. 13 ఎకరాల్లో మాల్ నిర్మించడం దేశంలో చాలా తక్కువచోట్ల ఉంది. ఇదే ఇనార్బిల్ మాల్ హైదరాబాద్‌లో 8 ఎకరాల్లో మాత్రమే ఉంది. విశాఖలో నిర్మించేది దక్షిణ భారతదేశంలోని పెద్ద మాల్స్‌లో ఒకటిగా చెప్పొచ్చు. ఇందుకోసం రహేజా గ్రూప్ రూ.600 కోట్ల పెట్టుబడి పెడుతోంది. దీంతో 8 వేల మందికి ఉపాధి లభించనుంది. రాబోయే రోజుల్లో నాలుగు ఎకరాల్లో ఐటీ సేవలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. 2.50 లక్షల చదరపు అడుగుల స్థలం ఐటీ సేవల కోసం అందుబాటులోకి వస్తే మరో 3 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.













