ఏపీలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. వైఎస్సార్- జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ సరిహద్దు గ్రామం జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడులో సరిహద్దు రాయిని పాతి భూ రీసర్వేకు శ్రీకారరం చుట్టారు. అనంతరం జగ్గయ్యపేట ఎస్జీఎస్ కాలేజీలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్ద రీసర్వే ఆర్మీ ఫోర్స్‌కి ముఖ్యమంత్రి పచ్చజెండా ఊపి, రీ సర్వే కోసం సిద్దం చేసిన డ్రోన్స్‌ను ఆరంభించారు. ఈ నెల 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రీ సర్వే ప్రారంభం కానుంది. మూడు విడతల్లో 1.26 కోట్ల హెక్టార్లలో సమగ్ర భూ సర్వే జరగనుంది. ఈ కార్యక్రమాన్ని మూడుదశల్లో చేపట్టి 2023 జనవరి నాటికి పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రాష్ట్రంలో వందేళ్ల తర్వాత భూముల సమగ్ర సర్వే జరుగుతోంది. రాష్ట్రంలో 1920-27 మధ్యలో భూముల సర్వే జరిగింది. మళ్లీ ఇంతవరకు చేపట్టలేదు. మధ్యలో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004-08 మధ్య భూభారతి పేరుతో ప్రారంభించినా, అది మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత ఏపీలో భూధార్ పేరుతో సమగ్ర సర్వేకు శ్రీకారం చుట్టారు. దీనికి జగ్గయ్యపేట మండలానే పైలట్ ప్రాజెక్టుగా ఎంపీక చేశారు. ఇదీ పూర్తి కాలేదు. ప్రస్తుతం వాటి స్థానంలో రీసర్వేకు శ్రీకారం చుట్టారు.













